Several Corporations Chairman Resigned in Telangana : ప్రభుత్వం మారడంతో కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తున్నారు. పదహారు మంది నేతలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా చేశారు. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులకు సోమ భరత్ కుమార్, జూలూరి గౌరీ శంకర్, పల్లె రవి కుమార్ గౌడ్, ఆంజనేయ గౌడ్, మేడె రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, గూడూరు ప్రవీణ్, గజ్జెల నగేష్, అనిల్ కూర్మాచలం, రామచంద్ర నాయక్, వలియా నాయక్, వై.సతీష్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్ సింగ్, పాటిమీది జగన్మోహన్ రావు తమ రాజీనామా లేఖలను సీఎస్‌కు సమర్పించారు. పదవులకు రాజీనామా చేసిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌ను కలిశారు. పార్టీ బలోపేతానికి పని చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర రావు రాజీనామా
ఓఎస్డీ ప్రభాకర్‌రావు రాజీనామా: ఓఎస్‌డీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఓఎస్‌డీగా ప్రభాకర్ రావుకు బాధ్యతలు అప్పగించింది గత ప్రభుత్వం. అయితే తాజాగా మారిన సమీకరణాల దృష్ట్యా ఆయన రాజీనామా చేశారు. ప్రభాకర్ రావు ప్రతిపక్ష పార్టీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ గతంలో పలుసార్లు రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి తన రాజీనామా లేఖను పంపారు. రాధా కిషన్‌ను గత నెలలో ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తప్పించింది.