Telangana Congress leaders were injured: రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలకు గాయలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించిన మొదటి రోజు స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో పలువురు ముఖ్య నేతలు కిందపడి గాయపడ్డారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య, మహేష్‌కుమార్ గౌడ్ లకు గాయాలయ్యాయి. పొన్నాల లక్ష్మయ్య మోచేతికి గాయపడగా... రక్తంతో ఇబ్బందులు పడిన పొన్నాలకు.. మాజీ మంత్రి గీతారెడ్డి కట్టుకట్టారు. పొన్నాల లక్ష్మయ్యను ఏఐజీ హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
110 కిలోమీటర్ల మేర యాత్ర:దీపావళి సందర్భంగా మూడు రోజులు పాదయాత్రకు రాహుల్ విరామం ఇవ్వనున్నారు. ఈనెల 27న మక్తల్ మండలం చందాపూర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 110 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోని మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో స్థానిక నేతలకు అవకాశం కల్పించడం, శిబిరాల వద్ద వారితో మాట్లాడించడం ద్వారా తృతీయ, ద్వితీయశ్రేణి నేతల్లో ఉత్సాహం నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.