Haritha haram: ఏడో విడత.. 'హరిత' సన్నద్ధత - తెలంగాణలో ఏడవ దశ హరితహారం
ఆరు విడతలు పూర్తయిన హరితహారం కార్యక్రమాన్ని ఏడో విడత చేపట్టేందుకు సంబంధిత శాఖలు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15,126 నర్సరీలను ఏర్పాటుచేసి వాటిలో మొక్కలు పెంచుతున్నారు. వర్షాలు మొదలై, ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపిన వెంటనే కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశముందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
2021-22లో 19.86 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖకు నిర్దేశించింది. ఈ ఏడాది నర్సరీల్లో మొక్కల పెంపకంపై కరోనా వ్యాప్తి కొంతమేర ప్రభావం చూపింది. కరోనా కారణంగా కూలీలు అనుకున్నమేరకు రాకపోవడం, పనులు ఆశించిన మేర జరగకపోవడంతో నర్సరీల్లో మొక్కలు పెంపకం కొంత ఆలస్యం అయినట్లు సమాచారం. అయినా.. లక్ష్యం మేరకు మొక్కలు అందుబాటులోకి వస్తాయని, నాటడం ఒకేసారి ఉండదని వర్షాకాలం పూర్తయ్యేవరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆరు విడతలు కలిపి హరితహారం కార్యక్రమానికి రూ.5,591.51 కోట్లు ఖర్చయినట్లు అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో హరితహారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.