తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ఏడో విడత హరితహారం - హరితహారం వార్తలు

అన్ని రకాల రహదారుల వెంట 3000 కిలోమీటర్ల మేర బహుళ వరుసల్లో రహదారి వనాల అభివృద్ధి...! మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వనాలు... ఇవీ, ఏడో విడత హరితహారం ప్రత్యేకతలు. వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం కోసం సన్నాహకాలు ఊపందుకున్నాయి. దాదాపు 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మేడ్చల్ నుంచి ఆదిలాబాద్ వరకు జాతీయ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టనున్నారు.

Haritharam
హరితహారం

By

Published : Jun 24, 2021, 4:58 AM IST

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఏడో విడత వచ్చే నెల ఒకటవ తేది నుంచి ప్రారంభం కానుంది. పల్లెప్రగతి, పట్టణప్రగతితో కలిపి ఈసారి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే ప్రకటించారు. ఏడో విడత హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దఫాలో రహదారుల వెంట బహుళ దశల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రకాల రహదారుల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

జాతీయ రహదారుల వెంట

గతంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి, హైదరాబాద్-బెంగళూరు తరహాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఒక్కో ఉమ్మడి జిల్లాలో సగటున 300 కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల మేర జాతీయ, రాష్ట్ర, ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్ రహదార్ల వెంట మొక్కలు నాటాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా రహదార్ల వెంట పలు వరుసల్లో నాటేందుకు అనుగుణంగా పెద్దమొక్కలను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా 44వ జాతీయ రహదారిపై మేడ్చల్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు వరకు భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. అందుకోసం ఇప్పటికే ఆ రహదారి వెంట గుంతలు తవ్వుతూ అవెన్యూ ప్లాంటేషన్ కోసం మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రకృతివనాలు

ఆరో విడత హరితహారంలో భాగంగా చేపట్టిన ప్రకృతివనాల అభివృద్ధి మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రకృతి వనాలను అభివృద్ధి చేశారు. అర ఎకరం మొదలు ఎకరం వరకు స్థలంలో యాదాద్రి నమూనాలో చిట్టడవులను అభివృద్ధి చేశారు. ప్రత్యేకించి గ్రామాల్లో దాదాపుగా అన్ని చోట్లా పల్లెప్రకృతి వనాలు సిద్ధమయ్యాయి. పట్టణప్రాంతాల్లోనూ స్థలాలు అందుబాటులో ఉన్న చోట పట్టణ ప్రకృతివనాలు ఏర్పాటయ్యాయి. ప్రకృతి వనాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 20 వేల ఎకరాల మేర పచ్చదనం విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే స్ఫూర్తితో ఈమారు బృహత్ ప్రకృతి వనాలను అభివృద్ధి చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.

గ్రీన్ ఫండ్​

రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఐదు నుంచి పది కిలోమీటర్ల మేర ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. కనీసం ఐదెకరాలకు తగ్గకుండా వీటిని అభివృద్ధి చేసి ప్రజల కోసం అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. పట్టణ, గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లోని గ్రీన్ ఫండ్​ను ఇందుకోసం వినియోగించనున్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ భూములను సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. కనీసం మరో ఐదువేల ఎకరాల్లో ఈ తరహా వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.

సిద్ధంగా 24 కోట్ల మొక్కలు

ఏడో విడత హరితహారం కోసం అటవీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు 24 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచాయి. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీ, పట్టణప్రాంతాల్లోని వార్డుల్లో ప్రస్తుతం నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఇక నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ విస్తీర్ణంలో సెంట్రల్ నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి:Lucky stone: జ్యోతిష్కుడి మ్యాజిక్కు.. దొంగలే కాదు పోలీసులూ అవాక్కు..!

ABOUT THE AUTHOR

...view details