తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో... రాష్ట్రమంతటా కోలాహలం నెలకొంది. తీరొక్క పూలతో బతుకమ్మను కొలిచే పూలపండుగ ఇది. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారు. ఇవాళ ఏడో రోజు సందర్భంగా... వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. బియ్యం పిండితో వేపకాయల ఆకృతిలో పిండివంటలు చేసి... అమ్మవారికి నివేదిస్తారు.
వేపకాయల బతుకమ్మ..
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా బతుకమ్మను పేరుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఎంతో ఉత్సాహంగా కొనసాగే బతుకమ్మ ఆటలో ఏడో రోజున అమ్మవారిని 'వేపకాయల బతుకమ్మ'గా అభివర్ణిస్తుంటారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, పట్టుకుచ్చు వంటి తీరొక్క పూలతో ఏడంతరాల బతుకమ్మను పేరుస్తారు.
రోజుకో తీరుగా..
తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ... రెండో రోజు అటుకుల బతుకమ్మ.. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోనాడు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అర్రెం అనగా బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో పేరుతో కొలుస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ప్రసాదాలను నివేదిస్తారు.