Pending Bills at Governor Tamilisai : సెప్టెంబర్ నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను తీసుకొచ్చింది. అందులో 2 కొత్త బిల్లులు కాగా... మిగతా 6 చట్టసవరణలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం చేసేందుకు సర్కార్ బిల్లును తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న అటవీకళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీవిశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పన కోసం మరో బిల్లును తీసుకొచ్చింది. మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం బిల్లు తెచ్చింది.
Pending Bills in Telangana : అలాగే.. జీహెచ్ఎంసీ, పురపాలకచట్టాలకు సవరణ చేస్తూ ఇంకొక బిల్లును తెచ్చింది. వీటితో పాటు పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టం, GST చట్టాలను కూడా సవరిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీన మొత్తం 8 బిల్లులు ఉభయసభల ఆమోదం పొందాయి. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం అనంతరం ఆమోదం కోసం వాటిని రాజ్‌భవన్‌కు పంపారు. అయితే అందులో ఒక్క జీఎస్టీ చట్టసవరణ బిల్లు మాత్రమే ఆమోదం పొంది చట్టంగా రూపు దాల్చింది. మిగిలిన ఏడు బిల్లులకు ఇంకా ఆమోదముద్ర పడలేదు.
7 బిల్లుల్లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టసవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. కేంద్ర చట్టంతో ముడిపడి ఉన్నందున రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మిగతా ఆరు బిల్లులకు కూడా ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ వద్దే పెండింగ్‌లోనే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై విద్యాశాఖ మంత్రి, అధికారులను పిలిపించి మరీ వివరణ తీసుకున్నారు. ఆ బిల్లు సహా ఏవీ కూడా ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వ్యాపారమా అని కూడా తమిళిసై ప్రశ్నించారు. బిల్లుల ఆమోదానికి నిర్ధిష్ట గడువేమీ లేదని కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు. నియామకాల విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకూడదన్నదే తన అభిమతమన్న తమిళిసై... బిల్లులు పెండింగ్‌లో లేవని, పరిశీలనలో ఉన్నాయని ఇటీవల వ్యాఖ్యానించారు. 4 నెలలు గడిచినప్పటికీ బిల్లులకు ఇంకా ఆమోదముద్ర పడలేదు.
వచ్చే నెల మూడో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు మళ్లీ సమావేశం అవుతున్న తరుణంలో బిల్లులపై మరోమారు చర్చ ప్రారంభమైంది. బిల్లుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలతో పాటు బడ్జెట్ పద్దుల ఆమోదం కోసం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.