DSP POST police department:పోలీసు శాఖలో ఉద్యోగుల విభజన కసరత్తు తుది దశకు చేరుకుంది. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు ఆప్షన్ల ప్రక్రియపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీని ప్రకారం.. గతంతో పోల్చితే డీఎస్పీ పోస్టుల విషయంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు డీఎస్పీ పోస్టు రాష్ట్రస్థాయి కేడర్‌గా ఉంది. తాజా ప్రక్రియ నేపథ్యంలో మల్టీజోనల్ కేడర్‌గా మారనుంది. అయితే, ఇది కేవలం రిక్రూట్‌మెంట్ ప్రక్రియకే వర్తిస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోస్టింగ్‌ల విషయంలో మాత్రం రాష్ట్రస్థాయి కేడర్‌గానే పరిగణనలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో డీఎస్పీ పోస్టుల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఇన్‌స్పెక్టర్ల పోస్టులు సైతం మల్టీజోనల్ కేడర్‌గానే ఉండనున్నాయి. హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్సై పోస్టులు జోనల్ కేడర్‌గానూ.. కానిస్టేబుల్ పోస్టుల్ని జిల్లా కేడర్‌గానూ పరిగణించనున్నారు. అలాగే, మినిస్టీరియల్ స్టాఫ్‌లో సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టుల్ని జోనల్ కేడర్‌లో, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల్ని మల్టీజోనల్ కేడర్‌లో ఉంచారు.
మల్టీజోన్లతో స్వల్ప మార్పులు:రాష్ట్రంలో ఇప్పటివరకు హైదరాబాద్, వరంగల్ జోన్లు ఉండగా.. ఇకపై మల్టీజోన్-1, 2గా వ్యవహరించనున్నారు.
*మల్టీజోన్-1లో జోన్-1(కాళేశ్వరం), జోన్-2(బాసర), జోన్-3(రాజన్న), జోన్-4(భద్రాద్రి) పేరిట నాలుగు జోన్లు ఉండనున్నాయి.- మల్టీజోన్-2లో జోన్-5(యాదాద్రి), జోన్-6(చార్మినార్), జోన్-7(జోగులాంబ) ఉంటాయి. జోన్ల వారీగా పోలీస్ యూనిట్లను ఖరారు చేశారు. వీటికి డీఐజీలు యూనిట్ అధికారిగా ఉండనున్నారు.
కాళేశ్వరం జోన్: రామగుండం పోలీస్ కమిషనరేట్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు
బాసర జోన్: నిజామాబాద్ కమిషనరేట్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల
రాజన్న జోన్: సిద్దిపేట, కరీంనగర్ కమిషనరేట్లు, సిరిసిల్ల రాజన్న, కామారెడ్డి, మెదక్