ఏకే 47 రైఫిళ్లు 3, పిస్టళ్లు 9, రివాల్వర్లు 3, తపంచాలు 7, ఎస్‌బీబీఎల్ 12 బోర్ గన్ 1, స్టెన్‌గన్ 1, లైవ్ రౌండ్లు(తూటాలు) 616, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ 1; 21 కార్లు, 26 ద్విచక్ర వాహనాలు, 602 సెల్‌ఫోన్లు.. ఏమిటివన్నీ ఏదైనా ఆర్మీ క్యాంప్‌లోని సామగ్రా? కాదు.. కాదు.. నాలుగేళ్ల క్రితం ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం స్థావరాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు.
వీటితో పాటు రూ.2.16 కోట్ల నగదు, 2,482 కిలోల వెండి, దాదాపు 2 కిలోల బంగారం, 752 భూదస్తావేజులు, 130 డైరీలు, పలు పేలుడు పదార్థాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) సంస్థ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంలో విస్తుగొలిపే ఈ అంశాలు వెలుగుచూశాయి.
హైదరాబాద్ షాద్‌నగర్ శివారులో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం మృత్యువాత పడిన అనంతరం నార్సింగిలోని అతడి ఇంటితోపాటు వివిధ ప్రాంతాల్లోని స్థావరాలు, బినామీల ఇళ్లలో పోలీస్ బృందాలు జరిపిన సోదాల్లో ఏమేం బయటపడ్డాయనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఆ కేసును పర్యవేక్షిస్తున్న సిట్ దర్యాప్తులో ఏం తేలిందనేది ఇప్పటికీ రహస్యమే. అయితే స్వాధీనం చేసుకున్న వస్తువులపై ఎఫ్‌జీజీ దరఖాస్తుకు ఉత్తర మండలం ఐజీ నాగిరెడ్డి తాజాగా సమాధానమిచ్చారు. ఆ సంచలన వివరాల్ని ఎఫ్‌జీజీ సోమవారం బయటపెట్టింది.
సహకరించిన అధికారులెవరో?
నయీంకు అన్ని ఆయుధాలు ఎలా సమకూరాయనేది మిస్టరీ గానే ఉంది. సంఘవిద్రోహ శక్తుల నుంచి సమకూర్చుకున్నాడా? లేక లైసెన్స్‌లు తీసుకుని కొనుగోలు చేశాడా? అయితే ఇన్నింటికి ఎవరు లైసెన్సులు ఇచ్చారు? ఎవరైనా అధికారులు సహకరించారా? అనేది తేలాల్సి ఉంది. ఆ దిశగా సిట్ దర్యాప్తు సాగడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విమర్శించింది. నయీం స్థావరాల్లో 752 భూదస్తావేజులు లభ్యమయ్యాయి. ఇన్ని రిజిస్ట్రేషన్లు అధికారుల సహకారం లేకుండా పూర్తయ్యే అవకాశాలు లేవని ఈ సంస్థ ఆరోపించింది. అదే నిజమైతే అందుకు సహకరించిన అధికారులెవరనేది తేలాల్సి ఉంది. నయీం డైరీలను, మొబైళ్ల డేటాను విశ్లేషిస్తే చాలా మంది పోలీస్ అధికారులతో అతడి సంబంధాలు బహిర్గతమవుతాయని ఎఫ్‌జీజీ స్పష్టం చేస్తోంది.