SOMESH KUMAR REPORTED TO AP : మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆ రాష్ట్ర సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసి జాయినింగ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌తో సోమేశ్‌కుమార్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.
సీఎస్‌గా సోమేశ్‌కుమార్ కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. విభజన సమయంలో ఆయనను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగా.. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) తెలంగాణకు మార్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే నేటిలోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సోమేశ్‌కుమార్ నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. తనకు అప్పగించే బాధ్యతల్లో కొనసాగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త సీఎస్‌గా శాంతికుమారి..: ఇదిలా ఉండగా.. సోమేశ్‌కుమార్ స్థానంలో తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారిని ప్రభుత్వం నియమించింది. హైకోర్టు తీర్పు కారణంగా సోమేశ్‌కుమార్ రిలీవ్ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతికుమారిని ఎంపిక చేయగా ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో సీఎస్‌గా బీఆర్‌కే భవన్‌లో 3:15 గంటలకు శాంతికుమారి బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే ముందు శాంతికుమారి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు శాంతికుమారి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ కలెక్టర్‌గానూ..: ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్-ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. గతంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌గా ఆమె పని చేశారు.