తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుటాకుల వెతలు.. కరోనాతో కన్నీటి సుడులు! - old people suffered from corona crisis

బయటకు రావద్దన్న ఆంక్షలకు తోడు బాధలు పంచుకునేందుకు ఆప్తులు లేకపోవడం.. పూటగడిచే అవకాశం లేక నిత్యం భయం భయంగా ఒంటరిగా గడుపుతున్నారు భాగ్యనగరంలోని అనేకమంది వృద్ధులు. పింఛను సొమ్ములు తీసుకునేందుకు కూడా బ్యాంకుకు వెళ్లలేకపోతున్నారు.

senior citizens suffering during lock down
పండుటాకులు.. కన్నీటి సుడులు!

By

Published : Jun 8, 2020, 2:51 PM IST

కరోనా మహమ్మారి వ్యాపించేందుకు అవకాశం ఉన్న జాబితాలో వృద్ధులున్నారు. రోజువారీ సంపాదనపై ఆధారపడినవారు మొదలుకొని విదేశాల్లోని బిడ్డలు పంపే సొమ్ములతో జీవితాన్ని సాగించే వయోధికుల వరకు పరిస్థితి ఆవేదనాభరితంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరమవడంతో పిల్లల నుంచి నెలవారీ వచ్చే డబ్బులు సకాలంలో అందట్లేదు. ప్రతి 1000 మంది జనాభాలో 10-20శాతం 50-60 ఏళ్ల పైబడిన వారు ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి.

ఊతమిచ్చేవారు లేక..

గ్రేటర్‌ పరిధిలో సుమారు 15లక్షల మంది వయోధికులు ఉన్నట్టు అంచనా. వీరిలో అధికశాతం ఆసరా పింఛన్లు, బిడ్డలపై ఆధారపడిన వారు. వృద్ధాప్యంలో ఆదుకోవాల్సిన పిల్లల నిర్లక్ష్యంతో నగరానికి చేరినవారు ఏదో ఒక పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. కరోనా భయంతో ఎక్కువమంది నాలుగు గోడలకే పరిమితమయ్యారు.

బేగంపేటకు చెందిన విజయకుమార్‌ నాలుగేళ్ల క్రితం పదవీవిరమణ చేశారు. ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో పనిమనిషి మానేసింది. అప్పటివరకు చేదోడుగా ఉండే ఇరుగు పొరుగు కూడా ముఖం చాటేశారు. మందులు తీసుకొచ్చేవారు లేరు.

మణికొండలో కాయగూరలు విక్రయిస్తూ బతికే వృద్ధ దంపతులు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నారు. దాచుకున్న సొమ్ములు ఖర్చయ్యాయి. ఎవరి వద్ద చేయిచాచలేక ఉన్నదాంట్లో సర్దుకుంటున్నారు. వృద్ధులను వెంటాడుతున్న భయాలు వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నాయని న్యూరోసైకియాట్రిస్ట్‌ హరీష్‌చంద్రారెడ్డి తెలిపారు. ఒంటరితనం, వైరస్‌ సోకుతుందనే ఆందోళన అధికశాతం వృద్ధుల్లో కనిపిస్తున్నట్టు విశ్లేషించారు. ఉపాధి దూరమవుతుందనే భయంతో ఓ వృద్ధుడు నీటికుంటలో దూకి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సేవా కార్యక్రమాలు చేయలేకపోతున్నాం

మా కాలనీలో వయోధికులం (సీనియర్స్‌ సిటిజన్స్‌) అంతా కలిసి వేసవిలో ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేపట్టేవాళ్లం. ఇంకుడు గుంతలు, మొక్కల పర్యవేక్షణ, స్వచ్ఛభారత్‌ విజయవంతంగా నిర్వహించాం. ప్రస్తుతం మేమంతా ఇళ్లకే పరిమితమయ్యాం. సేవ చేయాలనే దృక్పథం ఉన్నా వృద్ధులు ఇంటి నుంచి బయటకు రాకూడదనే ఆంక్షలతో నిరుత్సాహపడ్డాం.

- సత్తిరెడ్డి

ఉపాధి ఆగింది

ఇంట్లో తయారుచేసే చేనేత వస్త్రాలు, పచ్చళ్లు, పిండివంటలు బయట అమ్ముతూ సాయంగా ఉండేదాన్ని. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఏం చేయలేకపోతున్నాననే బాధగా ఉంటుంది. ఒంట్లో సత్తువ ఉన్నతకాలం ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి సాయపడాలనే ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి చేయలేకపోతున్నా.

-పార్వతి

ఇల్లు జైలుగా అనిపిస్తుంది

లాక్‌డౌన్‌ ముందు వరకూ ఉదయం, సాయంత్రం నడకకు వెళుతుండేవాడిని. తోటివారితో మంచిచెడులు మాట్లాడితే ఉపశమనం కలిగేది. మనసు తేలికపడేది. ఇప్పుడు నాలుగు గదులకే పరిమితమయ్యాను. స్నేహితులను కలవక మూడు నెలలవుతుంది. అతికష్టంగా రోజు గడుస్తుందనే చెప్పాలి. కుంగుబాటు ఎక్కువగా బాధిస్తుంది.

- భిక్షపతి

ABOUT THE AUTHOR

...view details