Dalitha bandhu: దళిత కుటుంబాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం తదుపరి దశ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొంతమంది లబ్ధిదారులకు యూనిట్లు అందగా.. మిగిలిన వారికి చెందిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఎంపిక చేసిన చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాల్లో అన్ని దళిత కుటుంబాలకు పథకం అమలు ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ లబ్ధిదారుల తనిఖీ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
Dalitha bandhu: నియోజకవర్గానికి 100 మంది.. తుది దశకు చేరిన ఎంపిక ప్రక్రియ! వాటితో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున దళిత కుటుంబాలకు పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాకు ఎస్సీ అభివృద్ధి సంస్థ బదిలీ చేసింది. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక శాసన సభ్యులకు స్వేచ్ఛనిచ్చింది. నియోజకవర్గంలోని దళిత కుటుంబాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దళితబంధు పథకం కోసం వంద చొప్పున కుటుంబాలను ఎంపిక చేసే వెసులుబాటు కల్పించింది.
లబ్ధిదారుల ఎంపికకు విభిన్న పద్ధతులు..
లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేలు విభిన్న పద్ధతులు అనుసరిస్తున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో గ్రామం నుంచి ఒక కుటుంబాన్ని కొందరు శాసనసభ్యులు ఎంపిక చేస్తుండగా.. ఒకే గ్రామంలోని అన్ని దళిత కుటుంబాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వర్తించేలా మరికొందరు ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తున్నారు. ఒకే గ్రామంలోనే అందరిని ఎంపిక చేస్తున్న నియోజకవర్గాల్లో లబ్ధిదారుల సంఖ్య వేర్వేరుగా ఉంటుంది. కొన్ని చోట్ల వందలోపు ఉంటుండగా.. మరికొన్ని చోట్ల వందకు పైగా వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 10వేల వరకు పేర్లు సర్కారుకి అందినట్లు సమాచారం.
ఆ పేర్లు ఇంకా రాలేదు..
హైదరాబాద్లో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు ఇంకా రాలేదని తెలిసింది. వచ్చిన పేర్లు, వివరాలను తనిఖీ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక దళితబంధు కోసం.. లబ్ధిదారులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. అనంతరం అతని ఆసక్తి, అనుభవం సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని యూనిట్లు మంజూరు చేస్తారు. హుజూరాబాద్ అనుభవం దృష్ట్యా.. యూనిట్ల మంజూరుపై జాగ్రత్త తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: Dalit Bandhu app: దళితబంధు అమలుకు రంగం సిద్ధం.. ప్రతి కుటుంబానికో డీపీఆర్