Seed Festival At Professor Jayashankar University : ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో భూములు చదును చేసుకోవడం, విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ప్రాంగణంలో విత్తన మేళా -2023 ప్రశాంతంగా సాగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన 59 రకాల వండగాల బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు
రాజేంద్రనగర్‌లో ప్రధాన ఆహార పంట వరి విత్తనాలు 635 క్వింటాళ్లు పైగా అందుబాటులో పెట్టారు. రైతులు పండిచిన పంటనే విత్తనాలుగా వాడుకోవడం ద్వారా నకిలీ విత్తనాలను అరికట్టవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు అధిక ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలపై ఆధారపడటం, నాసిరకం విత్తనాలతో విసిగిపోయి రైతులు నాణ్యమైన వంగడాల కోసం రాజేంద్రనగర్ వచ్చి కొనుగోలు చేసి తీసుకెళుతుండటం విశేషం.
'రైతులు అడిగే సన్న విత్తనాలు అందుబాటులోకి తెచ్చాం. కేఎన్ఎంహెచ్ , కందితో పాటు ఇతర విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం'. - డాక్టర్ ఎన్.రాంగోపాల్‌వర్మ, ప్రధాన శాస్త్రవేత్త.