Seed fair 2023 at Jayashankar University in Hyderabad : రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ఉత్తమ వ్యవసాయ విధానాలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా - 2023ను మంత్రి ప్రారంభించారు. మేలైన విత్తనం ద్వారా నాణ్యమైన లాభదాయకమైన పంటల ఉత్పత్తి లభిస్తుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులకు కేంద్రం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచం నడవాలంటే వ్యవసాయం ముఖ్యం: భారతదేశంలోనే అత్యధిక వ్యవసాయ భూమి ఉంది. ప్రపంచంలో సాంకేతికత పెరగవచ్చు, కొత్త కంపెనీలు రావచ్చు కానీ, ఆహారం కావాలంటే ఈ భూమి, రైతులే ముఖ్యమని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయం లేకపోతే ప్రపంచం నడవదని.. అందుకే తెలంగాణలో వ్యవసాయానికి, రైతులకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఎంత సాయం చేసినా తక్కువే:రైతులకు ఎంత సాయం చేసినా తక్కువేనని, కేంద్రం ఆ దిశగా ఇతోధికంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధానాల వల్ల తెలంగాణలో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా వినియోగదారుల అభిరుచి, వర్షపాతం, మార్కెటింగ్ డిమాండ్ అనుగుణంగా పంటలు సాగు చేస్తే... వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ వ్యవసాయోత్పత్తులు ప్రపంచాన్ని శాసిస్తాయని నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.