అద్దాల్లాంటి మేడలు, ఆకట్టుకునేలా అలంకరణలు... లోపటికి అడుగుపెట్టగానే చిరునవ్వుతో పలకరిస్తూ ఆహ్వానించే సిబ్బంది... హైదరాబాద్ మహానగరంలోని షాపింగ్ మాళ్లలోని దృశ్యాలు ఇవి. వ్యాపార పోటీని తట్టుకునేందుకు నిర్వాహకులు హంగులు, ఆర్బాటాలు చేస్తున్నారు. బహుళ అంతస్తుల్లో వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తున్న వ్యాపారులు... వినియోగదారులకు కావాల్సిన వస్తువులన్నింటినీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఆటవిడుపు కలిగేలా
మల్టీప్లెక్స్‌ల పేరుతో సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు ఒకే బహుళ అంతస్తుల భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3260 మల్టీప్లెక్స్‌లు, 4759 వాణిజ్య ప్రాంతాలున్నాయి. చిన్నపిల్లలకు ఆహ్లాదం, పెద్దలకు ఆటవిడుపు కలిగేలా అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నందున నగరవాసులు పెద్దఎత్తున బహుళ వాణిజ్య సముదాయాలను ఆశ్రయిస్తున్నారు. వీటిలో ప్రైవేట్ భద్రతా సిబ్బంది 23 వేల మంది ఉన్నారు.
ప్రయాణప్రాంగణాలు కూడా
సమాజంలో అశాంతిని సృష్టించడానికి సంఘ విద్రోహ శక్తులు ఇలాంటి ప్రాంతాలనే ఎంచుకుంటున్నారు. భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నా నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. ఇటు ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోనూ భద్రతా లోపాలున్నాయి.
ప్రజాభద్రతా చట్టం
ప్రజాభద్రతా చట్టం ప్రకారం షాపింగ్ మాల్స్, బహుళ అంతస్తుల భవనాలు, రెస్టారెంట్ల వంటివన్నీ స్వీయభద్రత ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో భాగంగా మెటల్ డిటెక్టర్లు, ప్రవేశ, నిష్క్రమణ భాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తి లోపలికి వెళ్లేటప్పుడు ప్రవేశ ద్వారం వద్దే అతనిని స్కానింగ్ చేసేలా పరికరం ఏర్పాటు చేయాలి. స్కానర్ దాటిన తర్వాత సెక్యురిటీ సిబ్బంది సదరు వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. బ్యాగులను తనిఖీ చేయాలి.