తెలంగాణ

telangana

ETV Bharat / state

అష్టదిగ్బంధంలో జియాగూడ..!

భాగ్యనగరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల జియాగూడను అష్టదిగ్బంధం చేశారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కరోనా ప్రభావిత కాలనీలు, బస్తీలను గుర్తించి కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా మార్చారు. బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది నేటి నుంచి ఇంటింటా పరీక్షలు నిర్వహించనున్నారు.

Hyderabad corona Latest news
Hyderabad corona Latest news

By

Published : May 15, 2020, 7:52 AM IST

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గురువారం గ్రేటర్​ 40 కేసులు నమోదు కాగా... జియాగూడ ప్రాంతంలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా కేసులు విజృంభిస్తుండటం వల్ల గత మూడు రోజులుగా ఇక్కడ హైఅలర్ట్‌ ప్రకటించారు. వెంకటేశ్వరనగర్‌, ఇందిరానగర్‌, శ్రీనగర్‌లోని సబ్జిమండి కూరగాయల మార్కెట్‌, జియాగూడ మేకలమండి, మటన్‌, చికెన్‌ షాపులు, మిగతా దుకాణాలన్నింటిని మూసివేశారు. కేవలం ఔషధ దుకాణాలు, వైన్‌షాపులు మాత్రం నడుస్తున్నాయి.

సబ్జిమండి, మేకలమండి వల్ల ఎక్కువ మంది ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంకా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జియాగూడ ప్రాంతం మొత్తాన్ని బంద్‌ చేసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ డీఎంసీ సువార్త, ఎ.ఎం.ఓ.హెచ్‌. ఎజాజ్‌ఖాన్‌ తదితరుల బృందం జియాగూడలోని కరోనా ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

నేటి నుంచి ఇంటింటా పరీక్షలు...

వైరస్‌ వ్యాప్తి తగ్గక పోవడం వల్ల ఇక నుంచి చతుర్ముఖ వ్యూహం అవలంబించాలని అధికారులు నిర్ణయించారు. వైరస్‌ కట్టడికి కంటెయిన్‌మెంట్‌ జోన్లతో పాటు అదనంగా కరోనా ప్రభావిత ప్రాంతాలైన వెంకటేశ్వరనగర్‌, దుర్గానగర్‌, సాయిదుర్గానగర్‌, ఇందిరానగర్‌ కాలనీలను నలువైపులా బారికేడ్లతో మూసివేసే చర్యలు గురువారం చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలతో పికెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది శుక్రవారం నుంచి ఆయా ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇలా కరోనా లక్షణాలు బయట పడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని జోనల్‌ కమిషనర్‌, డీసీపీ ఆదేశాలు జారీ చేసినట్లు గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

కరోనా భయంతో ఊళ్లకు వెళ్లేందుకు తమకు అనుమతిస్తూ పాస్‌లు జారీ చేయాలంటూ కొందరు కుల్సుంపురా ఠాణా చుట్టూ తిరుగుతున్నారు. కొందరు పాస్‌లు లేకుండానే అర్ధరాత్రిపూట వాహనాలపై ఊళ్లకు బయలుదేరి వెళ్లారు.

కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్లలో ఇప్పటి వరకు 350 మంది వలస కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇందులో కూకట్‌పల్లి సర్కిల్‌లో 180 మంది, మూసాపేట సర్కిల్‌లో రూ.170 మంది ఉన్నారు. వీరందరికీ స్టాంపింగ్‌ వేసి హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు ఉప కమిషనర్‌ ప్రశాంతి తెలిపారు. నిత్యం వీరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details