Security in Hyderabad For Assembly Elections 2023 : గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల ప్రత్యర్థి పార్టీలు తమ అడ్డాలోకి కాలుపెడితే సహించబోమంటూ.. పార్టీ కార్యకర్తలు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు కావటంతో పోలీసులు(Telangana Police) సైతం ఆచీతూచి స్పందిస్తున్నారు. ముందుగా ఇరువర్గాలకు నచ్చజెబుతూ.. మాట వినని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు.
Telangana Assembly Elections 2023 :రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను(TS Elections 2023) ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు ఎంతకైనా సిద్ధపడుతున్నాయి. అభ్యర్ధులు ఖరారుకావటం, నామినేషన్ల పర్వంతో ప్రచారం క్రమంగా వేడెక్కుతున్న క్రమంలో.. తమ ఇలాఖాలో ఆధిపత్యం చాటుకునేందుకు భారీ ప్రదర్శనలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఒకే మార్గంలో ర్యాలీలు, ప్రచారాలకు ఆస్కారం లేకుండా పోలీసులు అనుమతులిస్తున్నా... కొన్నిచోట్ల రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న తీరే సమస్యలకు కారణమవుతోంది.
Police Alert in Old City Hyderabad :రౌడీషీటర్లు, అసాంఘికశక్తులను బైండోవర్ చేసినా.. అనుచరులను రంగంలోకి దింపి మరీ హల్‌చల్ చేస్తున్నారు. పోలీసుల కళ్లెదుటే బహిరంగ దాడులకి పాల్పడుతున్నారు. మలక్‌పేట్, లంగర్‌హౌజ్,చార్మినార్ ప్రాంతాల్లో వరుస ఘటనలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగానే.. పోలింగ్‌కు ముందుగానే అదనపు బలగాలను రప్పిస్తున్నారు. దక్షిణ, పశ్చిమ, సౌత్‌ఈస్ట్, సౌత్‌వెస్ట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుగా మారింది. అలాంటి ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.