తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా ముగిసిన మహంకాళి బోనాలు... రంగంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత - ముగిసిన బోనాలు

డప్పు చప్పుళ్లు, పోతు రాజుల నృత్యాలు, మేళతాళాలు మంగళవాద్యాల నడుమ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రెండు రోజుల బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రజలను తాను కాపు కాచుకుంటానని ఉజ్జయిని మహంకాళి అమ్మ భవిష్యవాణి పలికింది. ఏనుగు అంబారిమీద ఊరేగింపుతో అమ్మవారి బోనాల సంబురాలు ఘనంగా ముగిశాయి.

bonam
bonam

By

Published : Jul 26, 2021, 6:05 PM IST

రెండు రోజుల లష్కర్ బోనాలు వైభవంగా ముగిశాయి. ఉదయం అమ్మవారికి పోతురాజులు బాలి కార్యక్రమం నిర్వహించి రెండో రోజు ఉత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామునే అమ్మ వారికి గుమ్మడికాయతో బాలి చేపట్టారు. అనంతరం పండితులు సాదరంగా... జోగిని స్వర్ణలతకు స్వాగతం పలికారు. రాజశ్యామల అమ్మవారి ఎదుట పచ్చి కుండపై నిల్చున్న స్వర్ణలతను ఆవహించిన మహాకాలి అమ్మవారు.... తెలంగాణ ప్రజల భవిష్యత్తును పలికింది. కరోనా మహమ్మారి నుంచి కాపాడే బాధ్యత తనదని.. ఉజ్జయిని మహంకాళి ఆలయం రంగం కార్యక్రమంలో.. స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు జరిపించిన పూజలను సంతోషంగా అందుకున్నానని... స్వర్ణలత వ్యాఖ్యానించారు. వర్షాల వల్ల కాస్త ఇబ్బందులు కలుగుతాయని... ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానని ఆమె పేర్కొన్నారు.

" మహమ్మారితో ఎన్ని ఇబ్బందులు పడ్డా నీకు పూజలు చేశాం తల్లి. నిన్ను కొలిస్తే.. మా బాధలు తొలగుతాయని నమ్మాం. నీ ఆశీర్వాదంతో మేము సుఖ సంతోషాలతో ఉంటాం. సకాలంలో వానలు, చక్కటి ఎండలతో పంటలు సమృద్ధిగా పండాలని ఆశీర్వదించు తల్లి." - పూజారి

" ఈ ఏడాది వర్షాల వల్ల రైతులు, భాగ్యనగర ప్రజలు కొంత ఇబ్బందులు పడతారు. కానీ.. నన్ను నమ్ముకోండి. మీ కష్టాలను నేను అడ్డుకుంటాను. అమ్మకు ఇన్ని పూజలు చేసినా.. ఏం ఒరగలేదని అనుకోకుండి. ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడతాను. నా భక్తులంతా ఆనందంగా ఉండేలా చూసే బాధ్యత నాది." - రంగంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

అమ్మ వారి రంగం కార్యక్రమం అనంతరం... పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మంగళవాద్యాల నడుమ కళాకారులు చేసిన నృత్యాలు అలరించాయి. పోతురాజుల విన్యాసాల అనంతరం అమ్మవారి ఏనుగు అంబారి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. అంబారిపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏనుగు అంబారి ఊరేగింపుతో అమ్మవారి బోనాల ఉత్సవాలు ముగిశాయి.

రెండు రోజుల బోనాల సంబురాలు ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్సవాల్లో స్వల్ప సంఖ్యలోనే భక్తులు పాల్గొనడం గమనార్హం. కొవిడ్ నేపథ్యంలో కేవలం సుమారు లక్షన్నర మంది భక్తులే అమ్మవారిని దర్శించుకున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:Ramappa Temple : రామప్ప ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, పర్యాటకులు

ABOUT THE AUTHOR

...view details