Four Thieves Arrested In Secunderabad Gold Theft Case : ఐటీ అధికారులమంటూ బెదిరించి సికింద్రాబాద్లోని బంగారు నగల దుకాణంలో దోపిడీ చేసిన దుండుగలందరినీ ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి 1700 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.60లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గత నెల 27వ తేదీన ఉదయం 11.30 గంటల సమయంలో సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో ఉన్న సిద్ది వినాయక బంగారు నగల దుకాణంలోకి 5గురు దుండగులు ప్రవేశించారు. దుకాణంలో పనిచేసే సిబ్బంది అంతా వాళ్ల పనుల్లో ఉండగా.. ఐదుగురు దుండగులు కూడా తమను తాము ఐటీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. దుకాణ సిబ్బందికి అనుమానం రాకుండా నకిలీ గుర్తింపు కార్డులు కూడా చూపించారు.
నిజమని నమ్మిన సిబ్బంది మిన్నకుండి పోయారు. సిబ్బంది ఫోన్లను లాక్కున్న దుండగలు, ఆ తర్వాత దుకాణంలోని లాకర్లో ఉన్న 17 బంగారు బిస్కెట్లను తీసుకున్నారు. ఈ బంగారానికి సంబంధించిన లెక్కలు సరిగ్గా లేవంటూ సిబ్బందిని భయపెట్టారు. ఒక్కో బిస్కట్ 100 గ్రాముల చొప్పున మొత్తం 1700 గ్రాములున్న బిస్కెట్లను లాక్కున్నారు. ఆ తర్వాత సిబ్బందిని గది లోపలే ఉంచి బయటి నుంచి గడియ పెట్టి దుండగులు పారిపోయారు. వచ్చిన వాళ్లు ఐటీ అధికారులు కాదని నిర్ధారించుకున్న యజమాని మధుకర్.. దోపిడీకి గురైన బంగారు బిస్కెట్ల విలువ రూ.60లక్షలకు పైగానే ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Secunderabad Gold Theft Case Updates : పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం గాలించారు. గత నెల 30వ తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ల నుంచి 530 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీన అభిజిత్ కుమార్ అనే మరో నిందితుడిని అరెస్ట్ చేసి 30తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.