Secunderabad Fire Accident Updates: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం సంభవించిన దక్కన్ మాల్ అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు ముగిశాయి. కానీ భవనం వద్ద 2 అగ్నిమాపక యంత్రాలను ఉంచారు. భవనం కూల్చివేతపై ముంబయి, దిల్లీలోని కంపెనీలతో అధికారుల సంప్రదింపులు జరుపుతున్నారు. భవనం పిల్లర్లకి ప్రమాదం లేదని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొన్నారు. పిల్లర్ల నాణ్యత చూసి భవనం కూల్చివేతపై నిర్లక్ష్యం వద్దని వారు సూచించారు.
ఇప్పటికే ఈ ఘటనలో ఒక మృతదేహాం ఆనవాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా రెండు మృతదేహాల ఆనవాళ్లు లభించకపోవడంతో గాలింపు నిలిపిశారు. రెండు మృతదేహాలపై స్పస్టత వచ్చిన తర్వాతనే భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్నారు. అక్కడక్కడ బూడిద సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక తర్వాత అధికారులు ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు.
అసలేం జరిగిదంటే:సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. భవనం నలువైపుల నుంచి అగ్నికీలలు ఎగిసిపడగా.. చుట్టూ మొత్తం పొగ అలుముకుంటోంది. ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది రక్షించారు. 22 ఫైరింజన్లతో మంటలార్పారు. ఎట్టకేలకు మంటలు చల్లారాయి. ఈ క్రమంలోనే ఒక మృతదేహాం అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎన్ఏ టెస్ట్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పైకప్పు పరిస్థితి ఏంటి..: ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. ఇనుప గ్రిల్స్ పైకప్పులకు ఆనుకుని ఉండటంతో వాటిని తొలగిస్తే పైకప్పు పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. కూల్చివేత సమయంలో పక్కనున్న భవనాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.