Secunderabad fire accident updates :సికింద్రాబాద్‌లో మొన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. డెక్కన్ నైట్‌వేర్ భవనం మొదటి అంతస్తులో పూర్తిగా కాలిన ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. దుకాణం సిబ్బందిలో ఒకరు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగినరోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. మంటల సమయంలో ముగ్గురు లోపలికి వెళ్లారని ఇతర సిబ్బంది తెలిపారు. దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ప్రమాదంలో ముగ్గురూ చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పొగ వల్ల రెండ్రోజులుగా అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఈరోజు మరోసారి పొగలు ఆర్పివేసి.. లోపలికి వెళ్లి పరిశీలించగా ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. మిగతా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.
రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. అయిదు అంతస్తుల భవనం, పెంట్‌హౌజ్‌లో డెక్కన్ నైట్‌వేర్ పేరిట క్రీడా సామగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే మంటలు వ్యాపించాయి. సెల్లార్‌లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమ క్రమంగా మంటలు చెలరేగాయి. సమీపంలోని మరో నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటన స్థలంలో 22 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు మంటలను అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ముగ్గురు, రెండో అంతస్తులో మరో వ్యక్తి చిక్కుకుపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే స్కైలిఫ్ట్‌ను ఘటనాస్థలికి రప్పించి.... సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా... పైనున్న వారిని దించటం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. అయినప్పటికీ తీవ్రంగా శ్రమించి, అతి కష్టంమీద భవనంలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చారు.
కూల్చివేయటం మేలని నిర్ణయించిన అధికారులు:ఈ భవనాన్ని ఎన్ఐటీ వరంగల్ సంచాలకులు రమణారావు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, క్లూస్ టీం, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వెళ్లటానికి వీలులేని చోటుకు డ్రోన్‌ను పంపి నలుమూలలా తనిఖీలు జరిపి, నాణ్యతను పరీక్షించారు. అన్ని అంతస్తుల స్లాబులు, గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించిన నిపుణులు ఏ సమయంలోనైనా పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. భవనం మునుపటిలా ఉపయోగపడే అవకాశం లేదని వెల్లడించారు. నిపుణుల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనాస్థలానికి పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులను ఖాళీ చేయిస్తున్నారు. భవనం దానంతటదే పడిపోక ముందే కూల్చివేయటం మేలని నిర్ణయించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చదవండి:'భవనం కూల్చేస్తాం.. ఎవరికైనా నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తాం'
సికింద్రాబాద్ ఘటన.. దక్కన్ మాల్ భవనంలో అడుగడుగునా అపాయమే
సీఎం నివాసంలో కలకలం.. తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి.. రంగంలోని దిగిన పోలీసులు..!