Secunderabad Club house: హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ క్లబ్‌లో తాజాగా భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.20కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన ఈ క్లబ్ సాదాసీదాది కాదు. భారత్‌లోని పురాతన క్లబ్‌లలో ఇదీ ఒకటి. దీనికంటూ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ క్లబ్‌ను బ్రిటిష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం 1878లో నిర్మించారు. మొదట్లో ఈ క్లబ్‌ను ‘సికింద్రాబాద్ పబ్లిక్ రూమ్స్’గా, ఆ తర్వాత ‘సికింద్రాబాద్ గ్యారిసన్ క్లబ్’, ‘సికింద్రాబాద్ జిమ్‌ఖానా క్లబ్’ పిలిచేవారు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్‌లో వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు దర్శనమిస్తాయి. అవి క్లబ్ చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎన్నో రకాల పక్షులకు ఈ భారీ చెట్లు ఆతిథ్యమిస్తుంటాయి. నిత్యం రద్దీ, ట్రాఫిక్‌తో కాంక్రీట్ అడవిగా మారిన ఈ నగరంలో ప్రకృతి సోయగాలు, ప్రకృతి అందాలతో ఈ క్లబ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. అందుకే, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ దీనికి వారసత్వ హోదాను కల్పించింది.
అప్పట్లో బ్రటిష్ అధికారులు, హైదరాబాద్ రాజులకే సభ్యత్వం..
secunderabad club in British ruling: స్వాతంత్య్రం వచ్చే వరకూ ఈ క్లబ్ అధ్యక్షుడిగా ఉండేందుకు కేవలం బ్రిటన్ పౌరులనే అనుమతించేవారు. ఈ క్లబ్‌లో సభ్యులుగా అందరూ బ్రిటిష్ అధికారులే ఉండేవారు. హైదరాబాద్ సంస్థానానికి చెందిన కొంతమంది రాజులకు మాత్రమే సభ్యత్వం ఉండేది. ఇప్పుడు ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, పోలీసు అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సహా అన్ని రంగాలకు చెందిన 8వేల మంది శాశ్వత సభ్యులు, 30వేల మంది క్రియశీలక సభ్యులున్నారు. క్లబ్ మేనేజింగ్ కమిటీని సభ్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుంటారు.