Cantonment MLA Sayanna Passed Away: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్‌ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న(72) కన్నుమూశారు. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. ఈ నెల 16న గుండెనొప్పితో నగరంలోని యశోద ఆసుపత్రిలో చేరారు. హృద్రోగ సమస్యలతో పాటు.. మధుమేహం వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యేను బతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని.. కార్డియాక్ అరెస్ట్ రావడంతో.. గుండె పనితీరు ఆగి మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొన్నేళ్ల క్రితమే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేశారని పేర్కొన్నారు.
కుటుంబసభ్యులు సాయన్న మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించారు. ఎమ్మెల్యే సాయన్న మృతికి మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ నేతలు సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాయన్న మృతితో పలువురు ఆయన నివాసం వద్దకు చేరుకుని సంతాపం తెలిపారు. సాయన్నకు ముగ్గురు కుమార్తెలు.
నేడు అంత్యక్రియలు:ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి నేడు మధ్యాహ్నం బన్సీలాల్‌పేట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు ఉదయం ఆయన నివాసం నుంచి.. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంచనున్నారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం మూడు గంటల పాటు పార్థివదేహాన్ని క్యాంపు కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఆ తర్వాత బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవ, తనతో ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అలాగే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డి, తలసాని, కొప్పుల ఈశ్వర్, దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఎమ్మెల్యేగా ప్రస్థానం: టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన సాయన్న.. 1994,1999,2004, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో.. బీఆర్‌ఎస్‌లో చేరి 2018 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఐదోసారి గెలుపొందారు. హుడా డైరెక్టర్‌గా 6 సార్లు సాయన్న బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా నియామకం అయ్యారు. వీధి బాలలకు పునరావాసంపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. ఆయన బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. వివాద రహితుడిగా ఉన్న సాయన్న.. ఎన్నో అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేస్తూ.. స్థానిక ప్రజల మెప్పు పొందారు.
ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ ఇవీ చదవండి: