Agniveer notification release: అగ్నివీరుల నియామక అర్హత పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ నియామక అధికారి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రెండు దశల్లో అగ్నివీరుల ఎంపిక ఉంటుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి అగ్నివీర్ ప్రాథమిక అర్హత పరీక్ష ఉంటుందని.. ఇందులో అర్హత సాధించిన వాళ్లకు ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ర్యాలీలో అర్హత సాధించిన వాళ్లను అగ్ని వీరులుగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
ఉత్సాహవంతమైన యువకులు www.joinindianarmy.nic.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఆర్మీ అధికారులు.. మెరిట్ ఆధారంగానే అగ్నివీరుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాట నమ్మి మోసపోవద్దని.. అలాంటి వారు ఎవరైనా ఉంటే పోలీసులు దృష్టికి లేదా ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
Indian Army: సైన్యానికి అదనపు బలం జోడించేలా.. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందనే లభిస్తోంది. తొలుత దేశం మొత్తం మీద అనేక విమర్శలు వెల్లువెత్తినా.. ఆ కార్యక్రమం వల్ల యువతకు లభించే అవకాశాలపై సైనిక అధికారులు కూలంకషంగా యువతకు వివరించారు. అధికారుల పిలుపుతో యువత పెద్ద ఎత్తున అగ్నిపథ్ నియామక ర్యాలీలో పాల్గొంది. అర్హత సాధించినవారికి ప్రస్తుతం దేశంలోని అనేక సైనిక కేంద్రాల్లో శిక్షణ కొనసాగుతోంది.
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ: అగ్నివీర్ ఎంపికలో మొత్తంగా మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో కేటాయించిన సెంటర్లలో అభ్యర్థులందరికీ ఆన్‌లైన్‌లో కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రెండో దశలో శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. మూడో దశలో వైద్య పరీక్షలు ఉంటుంది. సీఈఈ నిర్వహణ వల్ల రిక్రూట్‌మెంట్‌లో భారీ రద్దీలను తగ్గించేందుకు వీలు పడుతుంది.