ఏపీ సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో.. సచివాలయంలోని ఓ శాఖలో పనిచేసే ఒకరికి, గుంటూరులోని ఓ శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరికి పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే 227 మంది ఉద్యోగులను ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో బుధవారం అమరావతికి తీసుకొచ్చింది. వారిని నేరుగా తాడేపల్లి సమీపంలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లి, కరోనా నిర్ధరణ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. అందరూ గురువారం నుంచి విధులకు హాజరవుతున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి 11 గంటలకు వెల్లడించింది.
సచివాలయంలో ఒప్పంద, పొరుగు వేతన ఉద్యోగులతో కలిపి 2,500 మందికి పైనే ఉన్నారు. వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోమవారం నుంచి వారంపాటు సచివాలయ ఉద్యోగులందరికీ ‘ఇంటి నుంచే పని’ సౌకర్యం కల్పించి, అందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.. ఉన్నతాధికారులను కోరారు. నెగెటివ్ అని తేలిన వారిని విధుల్లోకి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.