రాష్ట్రంలో మరింత సమర్థవంతంగా అటవీ నేరాల అదుపుకు రహస్య సమాచార నిధి(secret service fund) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(minister indrakaran reddy) వెల్లడించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అటవీ శాఖ కార్యకలాపాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్ని అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. పచ్చదనం పెంపు, గ్రీన్‌ఫండ్, అటవీ పునరుద్ధరణ, రక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్‌ను అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల వంద శాతం అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. అధికారులంతా ఐదు గ్రూపులుగా ఏర్పడి సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు.
సమాచారం ఇచ్చే వ్యక్తులకు ప్రోత్సాహకాలు
అటవీశాఖ విషయాలపై మంత్రితోపాటు, సీఎంవో ఉన్నతాధికారుల సమక్షంలో పది గంటలపాటు ఈ మేధోమథనం జరిగింది. అడవుల రక్షణతోపాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కు(urban forest parks)లకు కూడా సమీప గ్రామాలు, కాలనీవాసులతో ప్రొటెక్షన్ కమిటీలు నియమించాలని నిర్ణయించారు. సీక్రెట్ సర్వీస్ నిధి(secret service fund) ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్... 4.06 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. అడవుల రక్షణ కోసం ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడంపై సమాచారం ఇచ్చే వ్యక్తులను ప్రోత్సహించేందుకు అటవీ శాఖ ఈ నిధిని వాడనుందని ప్రకటించారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (fdo) నేతృత్వంలో 2 నుంచి 2 లక్షల రూపాయలు, జిల్లా అటవీ అధికారి(dfo)కి 3 నుంచి 7 లక్షల రూపాయలు, చీఫ్ కన్జర్వేటర్‌కు 5 నుంచి 13 లక్షల రూపాయలు, పీసీసీఎఫ్‌కు 50 లక్షల రూపాయలు చొప్పున ఈ నిధి నుంచి రహస్య సమాచారం విలువ ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేలా నిబంధనలు పెట్టామని చెప్పారు.
పులిని వేటాడిన ఘటన బాధాకరం..
పచ్చదనం పెంపు, పునరుద్ధరణకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అటవీ అధికారులు, సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు పని చేస్తూ అడవులను రక్షించే బాధ్యత చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. ములుగు జిల్లాలో పులిని వేటాడిన ఘటన బాధాకరమని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని మంత్రి స్పష్టం చేశారు. అటవీ ఆక్రమణలను శాశ్వత నివారణ దిశగా సీఎం ఆలోచిస్తున్న తరుణంలో పోడు సమస్య పరిష్కారానికి చర్యలు మొదలైనందున తగిన రక్షణ చర్యలు, సిబ్బంది రేషనలైజేషన్ ద్వారా ఇది సాధ్యం అవుతుందని సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ అంశాలపై జిల్లా అధికారులు చెప్పిన సమస్యలు, పరిష్కార మార్గాలను ఆయన నోట్ చేసుకున్నారు. అటవీ శాఖ బలోపేతానికి సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.
అటవీ శాఖకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్..
ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని మరింత సమర్థవంతంగా పనిచేసి అటవీ శాఖ అధికారులు ఫలితాలు చూపెట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కోరారు. అవసరమైతే మరింత మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. అటవీ శాఖకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని... దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తోందని పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. సంబంధిత అన్ని శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించాలన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశానికే ఆదర్శవంతంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నామని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై జిల్లాల అధికారులు చేసిన సూచనలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:Minister KTR on Old City Development: 'వివక్ష లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధే సర్కారు లక్ష్యం'