రెండో దశ కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45- 59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలిరోజు పరిమిత కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. రాష్ట్రంలోని 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా రోజుకు 200 మందికి ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న రెండోదశ వ్యాక్సినేషన్ - second phase vaccination
రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికి టీకా వేస్తున్నారు. ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి టీకా వేయనున్నారు.
దాదాపు 1,500 కేంద్రాల్లో వేయాలని ముందు నిర్ణయించినా.. ప్రారంభం రోజున ఎటువంటి గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో ఆ సంఖ్యను 93కు కుదించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల్లో మాత్రమే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాస రావు తెలిపారు. ఇది కనీసం ఐదారు నెలలు కొనసాగుతుందని... అందువల్ల ఎవరూ తమకు లభించదేమోననే ఆందోళన చెందొద్దని సూచించారు. 60 ఏళ్లు దాటిన వారు ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరుకార్డు తదితర ఏదో ఒక గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదు