తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీ పోరు: నేటినుంచి రెండోదశ నామినేషన్లు

ఏపీలో ఇవాల్టి నుంచి రెండో దఫా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. దీనికోసం అన్ని జిల్లాల్లో నిర్ణీత ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు.

ఏపీ పంచాయతీ పోరు: రెండో దశకు నేటి నుంచి నామినేషన్లు
ఏపీ పంచాయతీ పోరు: రెండో దశకు నేటి నుంచి నామినేషన్లు

By

Published : Feb 2, 2021, 7:29 AM IST

ఆంధ్రప్రదేశ్​లో 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు 175 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 3335 పంచాయతీలు, 33,632 వార్డుల్లో రెండో దఫాలో పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఏపీలో ఇప్పటికే తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. ప్రస్తుతం నామపత్రాలకు సంబంధించిన అప్పీలు ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ నెల 13 న జరగనున్న రెండో దఫా పోలింగ్ ఉండటంతో దీనికి సంబంధించిన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి రెండోదఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్థానికంగా రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. దీనికోసం అన్ని చోట్లా రిటర్నింగ్ అధికారుల ఎంపిక సహా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు.

శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో 10 మండలాల్లో 278 పంచాయతీలు, 2716 వార్డుల్లో రెండోదఫాలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో పార్వతీపురం రెవెన్యూ డివిజన్​లో రెండోదఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో 415 పంచాయతీలు, 3908 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో 10 మండలాల్లో 261 పంచాయతీలు, 2584 వార్డుల్లో రెండో దఫాలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.

తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్​లోని 14 మండలాల్లో 247 పంచాయతీలు, 2806 వార్డుల్లో రెండో దఫా ఎన్నికలు జరగనుండగా.. ఈ ప్రాంతాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజన్లలో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. జిల్లాలోని 13 మండలాల్లో 210 పంచాయతీలు, 2404 వార్డుల్లో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.

కృష్ణా జిల్లాలో గుడివాడ రెవెన్యూ డివిజన్ లో 9 మండలాల్లో 211పంచాయతీలు, 1968 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. గుంటూరు జిల్లాలో నరసారావు పేట రెవెన్యూ డివిజన్ లో 11 మండలాల్లో 237 మండలాల్లో 2364 వార్డుల్లో రెండో దఫా ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఒంగోలు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో రెండో దఫాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. 22 మండలాల్లో 277 పంచాయతీలు, 2760 వార్డుల్లో ఈనెల 13 న పోలింగ్ జరగనుంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో 10 మండలాల్లో 198 పంచాయతీలు,1828 వార్డుల్లో నామ పత్రాల స్వీకరణ ప్రారంభంకానుంది.

కర్నూలు జిల్లాలోని నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో 13 మండలాల్లో 240 పంచాయతీలు, 2482వార్డుల్లో రెండోదఫాలో ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లలో 19 మండలాల్లో 310 పంచాయతీలు, 3220 వార్డుల్లో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. కడప జిల్లాలో కడప రెవెన్యూ డివిజన్ లో 12 మండలాల్లో175 పంచాయతీలు, 1750 వార్డులకు సంబంధించి నామినేషన్లు ఇవాళ్టి నుంచి స్వీకరిస్తారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో రెండోదపా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 17మండలాల్లో 276 పంచాయతీలు, 2842 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఇవాళ్టి నుంచి దాఖలైన నామపత్రాలను ఫిబ్రవరి 5న పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 6న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలిస్తారు. ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. ఫిబ్రవరి 13న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు రెండోదఫా పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, చేపడతారు. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం అదే రోజున ఉప సర్పంచి ఎన్నిక చేపడతారు.

ABOUT THE AUTHOR

...view details