తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయోగాత్మకంగా ఆన్​లైన్​లోనే ఎన్నికల ప్రక్రియ పరిశీలన - తెలంగాణ ఎస్ఈసీ పార్థసారధి లేటెస్ట్​ వార్తలు

అభ్యర్థులు నామినేషన్ల దాఖలు మొదలు... ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వరకూ ఈసారి ఓటింగ్‌ ప్రక్రియ మొత్తం వీలైనంత వరకూ ఆన్‌లైన్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారధి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వాటిని నిర్వహణ తదితర అంశాలపై 'ఈనాడు- ఈటీవీ భారత్​' ప్రత్యేక ముఖాముఖి

sec parthasaradhi on ghmc election process
ప్రయోగాత్మకంగా ఆన్​లైన్​లోనే ఎన్నికల ప్రక్రియ పరిశీలన

By

Published : Sep 18, 2020, 6:47 AM IST

  • కరోనా పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు ముఖ్యంగా త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎలా నిర్వహించబోతున్నారు? దాని తాలూకు సవాళ్లను ఎలా ఎదుర్కోబోతున్నారు?

జ: కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని.. బిహార్‌ శాసనసభకు జరగబోయే ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అనేక సూచనలు చేసింది. వాటితోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వీలైనంత వరకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుందామని అనుకుంటున్నాం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం మొదలు ఓటింగ్‌ ప్రక్రియను ఆన్‌లైన్లోనే నిర్వహించాలని భావిస్తున్నాం. అభ్యర్థుల నేర చరిత్ర, ఆదాయ వ్యయాలు, విద్యార్హతలు వంటివాటిని కూడా ఆన్‌లైన్లో ఉంచుతాం.

  • రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌ పరిధిలో ఇంచుమించు ప్రతి ఎన్నికలోనూ ఓటింగ్‌ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. బల్దియా గత ఎన్నికల్లో ఇది 45.29 శాతం మాత్రమే. దీన్ని పెంచేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా?

జ:తప్పకుండా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు మొదటిసారి ‘ఈ-ఓటింగ్‌’ విధానం అమలులోకి తేవాలనుకుంటున్నాం. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అయినా దీన్ని అమలు చేయాలని భావిస్తున్నాం. హైదరాబాద్‌ పరిధిలో ఓటు వేసేందుకు బయటకు రావడానికి చాలామంది ఇష్టపడటంలేదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇటువంటి వారి కోసమే 'ఈ-ఓటింగ్‌' తెచ్చే ఆలోచన ఉంది. అంటే ఇంట్లో నుంచే వారు తమ ఓటు వినియోగించుకోవచ్చు. ఇందులోని సాధ్యాసాధ్యాలపై ‘సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ అధ్యయనం చేస్తోంది. అది విజయవంతం అయితే మిగతా ఎన్నికల్లోనూ అమలు చేయవచ్చు. దానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహిస్తాం. ఓటు విలువ తెలిపేందుకు, ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ఆన్‌లైన్‌ ద్వారానే విభిన్న రీతిలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ముఖ్యంగా రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, స్వచ్ఛంద సేవా సంస్థలతోపాటు ప్రముఖులతోనూ ప్రచారం నిర్వహించాలనుకుంటున్నాం. అర్హత ఉన్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలు గడువులోపే పూర్తవుతాయా?

జ: 2016 ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. 2021 ఫిబ్రవరి 10 నాటికి కాలపరిమితి పూర్తవుతుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు సమాయత్తం అవుతున్నాం. ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాం. ఓటర్ల జాబితా ప్రచురించడం, పోలింగ్‌ స్టేషన్ల జాబితా తయారు చేయడం, ఎన్నికల సిబ్బందిని సమకూర్చుకొని వారికి శిక్షణ ఇవ్వడం, ఎన్నికల సామగ్రి సిద్ధం చేయడం వంటి పనులు ఇప్పటికే ప్రారంభించాం.

  • ఓట్ల గల్లంతుపై ప్రతిసారీ వివాదం రేగుతూ ఉంటుంది. దాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జ: ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తయారు చేయదు. శాసనసభ నియోజకవర్గాల్లోని జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి తీసుకొని జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డులవారీగా తయారు చేసి ప్రచురిస్తుంది. కొత్తగా ఓటర్లను నమోదు చేయాలన్నా, తీసివేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాలన్నా మొదట శాసనసభ పరిధిలోని ఓటరు జాబితాలోనే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ పేరు నమోదై ఉందో, లేదో తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలి.

  • తమ ఓటు ఎవరో వేశారని, రిగ్గింగ్‌ జరిగిందనే అరోపణలు వినిపిస్తుంటాయి. వాటిని ఎలా పరిష్కరించబోతున్నారు?

జ:ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరి ఓటు మరొకరు వేయడం దాదాపు అసాధ్యం. ఒకవేళ ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో ఒకరి ఓటు మరొకరు వేశారని చెబుతూ ఒక్క టెండర్‌ ఓటు నమోదైనా ఆ కేంద్రంలో పోలింగ్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తారు. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా మొట్టమొదటిసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘ముఖ కవళికలు గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం’ వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అంటే ఓటరు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తర్వాత కెమెరా ముందు నిల్చోగానే ఎన్నికల కమిషన్‌ డేటా బేస్‌లో అప్పటికే నమోదైన అతని ఫొటోతో ముఖ కవళికల్ని పోల్చుతుంది. ఏమాత్రం తేడా ఉన్నా పసిగడుతుంది. దీనివల్ల దొంగ ఓట్లను నివారించవచ్చు. అన్నింటికీ మించి పోలింగ్‌ కేంద్రంలో ప్రక్రియ సులభం, వేగవంతం అవుతుంది. సమయం ఆదా అవుతుంది.

ఇదీ చూడండిఃబిల్లులపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: మోదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details