ఏపీలో మొత్తం 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 16 శాతం స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు. సుమారు 10,890 మంది సర్పంచులు, 47,500 మంది వార్డు మెంబర్లు నేరుగా ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకితభావంతో పని చేసిందని కితాబిచ్చారు. అధికారులంతా ఎంతో విజ్ఞత, సంయమనంతో వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ఒక్కో విడతలో 90 వేలకు పైగా సిబ్బంది పని చేశారని చెప్పారు. 50 వేల మందికిపైగా పోలీసులు సమర్థంగా పని చేశారని, ప్రతి విడతలో 80 శాతానికి పైగా స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోందని వివరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుంది..
‘‘ ప్రతి విడతలోనూ అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులున్నా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకున్నారు. అవాంఛనీయ ఘటనలతో ఏ ఒక్కచోట కూడా రీపోలింగ్ జరగలేదు. ఎక్కడా ఎన్నికలు వాయిదా పడలేదు. రాజకీయ వర్గాలు, ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుంది. సమర్థత, చాకచక్యంతో కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పని చేశారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో మీడియా కీలకంగా వ్యవహరించింది’’