గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ సహా వీలైనంత ఎక్కువ ఐటీ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అధికారులకు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవో జ్యోతిబుద్ధప్రకాష్, ఎస్ఈసీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి పదో తేదీతో ముగియనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు గడవులోగా ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్... ఓటర్ల జాబితా తయారీ మొదలు పోలింగ్ కేంద్రాల ర్యాండమైజేషన్ కోసం టీ-పోల్ సాఫ్ట్ వేర్ ఉపయోగించేలా జీహెచ్ఎంసీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు.
గ్రేటర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం
జీహెచ్ఎంసీకి నిర్ణీత సమయంలోనే ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సారి పోలింగ్ శాతం పెరిగేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29శాతం పోలింగ్ శాతం నమోదైందని... ఈ మారు పోలింగ్ శాతం పెరిగేలా అవగాహన చర్యలు చేపట్టాలని తెలిపారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో ఈసీ మార్గదర్శకాలను పాటించాలన్న ఎస్ఈసీ... ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 800 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూడాలని తెలిపారు. పోలింగ్ విధుల కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు ముందుగానే సేకరించాలని ఆదేశించారు. గ్రేటర్ ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక తయారీ కోసం అక్టోబర్ రెండో వారంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు పార్థసారధి తెలిపారు. ఓటరు జాబితాలో మార్పు, చేర్పుల ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని, నోటిఫికేషన్ వచ్చే వరకు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని అదనపు సీఈవో జ్యోతిబుద్ధప్రకాశ్‌కు సూచించారు.
ఇవీ చూడండి: రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల కోసం కమిటీ ఏర్పాటు