ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై స్పందించింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారినపడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్‌షీల్డ్‌లు సరఫరా చేస్తామని పేర్కొంది. కరోనా టీకాలో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది.
ఎన్నికల విషయమై పార్టీలు ఎస్‌ఈసీతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పార్టీలు కోరుతున్నాయి. ఈ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా సామాజిక నాయకత్వం ఏర్పడుతుంది. ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. సవాళ్లను ఎదుర్కోవడంలో రాష్ట్ర ఉద్యోగులకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రకృతి విపత్తులు, ఎన్నికల నిర్వహణ ద్వారా పలుమార్లు నిరూపితమైంది. రాష్ట్ర ఉద్యోగులకు ఎవరూ సాటిలేరు - రాష్ట్ర ఎన్నికల సంఘం