గ్రేటర్ ఎన్నికల కోసం ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది.
జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ఆయా జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ సూచించారు. ప్రస్తుతం పాలకవర్గం కాలపరిమితి ముగిసే ఫిబ్రవరి పదో తేదీ లోపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న పార్థసారధి... 13న ఓటర్లు తుదిజాబితా ప్రకటించాక కూడా నోటిఫికేషన్ వరకు ఓటరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. స్థానికసంస్థల అదనపు కలెక్టర్లను డిప్యుటీ ఎలక్షన్ అథారిటీగా నియమిస్తున్నట్లు చెప్పారు.
కొవిడ్ నేపథ్యంలో విశాలమైన గదులు ఉండేలా పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని... రెవెన్యూ, పోలిస్ అధికారులను సంప్రదించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని ఎస్ఈసీ తెలిపారు. వెయ్యి లోపు ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులు... వెయ్యికి మించి ఓటర్లు ఉన్న చోట నలుగురు పోలింగ్ అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
2016 ఎన్నికల్లో అమలు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లనే ప్రస్తుత ఎన్నికల్లో అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పోలిస్ అధికారుల సహకారంతో బందోబస్తు ప్రణాళిక తయారు చేయాలని... ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిఘా, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను గుర్తించాలని పార్థసారధి తెలిపారు. బ్యాలట్ బాక్సులను సురక్షితంగా భద్రపరిచేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల కొరకు అనువైన ప్రాంతాలను గుర్తించి కొవిడ్ నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఐదులక్షల రూపాయలకు మించి వ్యయం చేయరాదని స్పష్టం చేశారు.