తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2020, 7:15 PM IST

Updated : Nov 23, 2020, 7:14 AM IST

ETV Bharat / state

'సాధారణ పరిశీలకులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'

గ్రేటర్​ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సాధారణ పరిశీలకులదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారధి అన్నారు. ఈ మేరకు సర్కిళ్లు, జోన్ల వారీగా నియమించిన సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికలు పూర్తయ్యే లోపు వారు ఐదుసార్లు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని కమిషనర్​ సూచించారు.

sec commissioner meeting with general observers
'సాధారణ పరిశీలకులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సాధారణ పరిశీలకులదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి అన్నారు. సర్కిళ్లు, జోన్ల వారీగా నియమించిన సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఆయన నేడు సమావేశమయ్యారు.

మరింత మెరుగ్గా పర్యవేక్షణ

జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుగురు సాధారణ ఎన్నికల పరిశీలకులు జోన్లలో పని మొదలు పెట్టినట్లు కమిషనర్​ పేర్కొన్నారు. పర్యవేక్షణ మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఒక్కో జోన్​కు ఇద్దరు సాధారణ పరిశీలకులను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు అధికారులు ఐదుసార్లు నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. మొదటిది నామినేషన్ల చివరిరోజు, రెండవది పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందు, మూడవది పోలింగ్ అయిన తరువాత, నాలుగోది ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఐదోది పరోక్ష ఎన్నిక పూర్తి అయిన తర్వాత సమర్పించాలని వివరించారు.

పోలింగ్​, కౌంటింగ్ రోజు వారు సమర్పించే నివేదికలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని కమిషనర్​ పేర్కొన్నారు. ఆ నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం.. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన తదితర విషయాలపై చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

దృష్టి సారించాలి

చెక్ పోస్ట్​లు, పికెట్​లలో పరిస్థితులు పర్యవేక్షించాలని కమిషనర్​ ఆదేశించారు. పోలీసు శాఖ అధికారులు సమస్యాత్మక, అతి సమస్యాత్మక, క్లిష్టమయిన పోలింగ్ కేంద్రాలను గుర్తించారని పేర్కొన్నారు. పరిశీలకులు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, మోడల్ కోడ్ ఉల్లంఘన, పోస్టల్ బ్యాలెట్, ఓటర్ల జాబితా, రాజకీయ పార్టీల సమావేశాలు, తదితర విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. రిజర్వ్​లో ఉన్న సాధారణ పరిశీలకులకు ప్రత్యేక విధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

పోలింగ్‌కు సచివాలయ ఉద్యోగులు

ప్రతి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయుల బదులు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఈ సారి సచివాలయ ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల బదులు జిల్లాల నుంచి కలెక్టర్‌ కార్యాలయ సిబ్బందిని పోలింగ్‌ విధుల్లో పాల్గొనేలా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా పోలింగ్‌కు హాజరయ్యే సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​, భాజపాలది చీకటి ఒప్పందం: మంత్రి జగదీశ్​రెడ్డి

Last Updated : Nov 23, 2020, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details