రైలు ప్రమాదాలు నివారించే దిశగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ మరో ముందడుగు వేసింది. గత నెల 30న ట్రైన్ కొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్-టీకాస్‌ను విజయవంతంగా ప్రారంభించింది. టీకాస్‌ను ప్రారంభించడం భారతీయ రైల్వేలో ఇదే తొలిసారని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
రైలు డ్రైవర్ బ్రేకులు వేయడంలో విఫలమైనపుడు, ప్రమాదకరంగా సిగ్నల్ పాసింగ్ అయినపుడు, రైలు నిర్ధేశించిన వేగాన్ని మించి దూసుకుపోయిన సమయంలో ప్రమాదాలను నివారించడమే టీకాస్ ప్రధాన లక్ష్యం. దీనికి అదనంగా నాన్-ఇంటర్ లాక్డ్ లేదా నాన్ సిగ్నల్స్ ద్వారా జరిగే ప్రమాదాలను నివారిస్తుంది. లోకో పైలట్ కేబిన్‌లో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ... మూవ్మెంట్ ఆథారిటీ, టార్గెట్ స్పీడ్, టార్గెట్ డిస్టెన్స్, సిగ్నల్ ఆస్పెక్ట్ తదితరవి సూచించడం ద్వారా లోకో పైలెట్‌కు సహాయకారిగా ఉండనుంది. ఈ వ్యవస్థను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.