మిషన్ కాకతీయలో(mission kakatiya scheme) భాగంగా ఉన్న చెరువులన్నింటినీ ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌కు స్కాచ్ అవార్డ్(Scotch Award) లభించింది. శనివారం రోజు జరిగిన కార్యక్రమంలో ఈఈ రామాచారి ఈ అవార్డును స్వీకరించారు. చిన్ననీటి వనరులకు పూర్వవైభవం తేవాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారు. ఈ పథకంలోని చెరువులన్నింటినీ ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు సాగునీటి శాఖకు చెందిన ఈ గవర్నమెంట్ డివిజన్ వారు ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. దీనికి ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ మార్గ నిర్దేశం చేయగా.. ఈఈ రామాచారి నేతృత్వంలోని డివిజన్ ఇంజినీర్లు అభివృద్ధి చేశారు. ఇది మిషన్ కాకతీయకు దక్కిన రెండో అవార్డు అని ఈఈ రామాచారి తెలిపారు. 2018లో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ ... బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీస్ కేటగిరీలో మిషన్ కాకతీయకు అవార్డును వచ్చింది.
2018లో బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీస్ కేటగిరీలో అవార్డు..
తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం (mission kakatiya scheme) దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రాష్ట్ర వ్యవసాయానికి సాగునీరు అందించడంతో పాటుగా గొలుసుకట్టు చెరువుల విధానానికి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం 2018లో కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖను ఎంపిక చేసింది.