తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగానది కరోనా రహితం... తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు - గంగానదిలో కరోనా మృతదేహాల వీడియోలు

గంగానదిలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరిపారు. గతంలో మృతదేహాలు కొట్టుకువచ్చినప్పటికీ ఈ నీరు కరోనా రహితమేనని తేల్చారు. సీఎస్‌ఐఆర్, ఐఐటీఆర్, సీపీబీ ఆధ్వర్యంలో నమూనాలు సేకరించి పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు నదిలో కరోనా వైరస్ లేదని నివేదించారు.

గంగానది కరోనా రహితం
గంగానది కరోనా రహితం

By

Published : Jul 9, 2021, 6:56 AM IST

గంగానది కరోనారహితమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. నదిలో వైరస్‌ ఆనవాళ్లు ఎక్కడా లభించలేదని తెలిపారు. గతంలో గంగానదిలో కరోనా మృతదేహాలు కొట్టుకువచ్చిన నేపథ్యంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా సొసైటీ గంగానది నీటిపై రెండు విడతల్లో పరిశోధనలు నిర్వహించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో గంగానది నుంచి సేకరించిన నీటిలో ఎక్కడా కూడా కరోనా వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

విస్తృత పరిశోధనలు..

కరోనా రెండోదశ ఉద్ధృతి సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లోని గంగానదిలో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలు కొట్టుకురావడం, పలు చోట్ల గంగానది ఒడ్డున అనేక మృతదేహాలను పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ నదిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికాలజీ రీసెర్చ్‌, సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డ్‌, యూపీ స్టేట్‌ పొల్యూషన్‌ బోర్డుతో కలిసి జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా సొసైటీ గంగానది నీటిపై పరిశోధనలు నిర్వహించింది.

రెండు విడతల్లో యూపీ, బిహార్‌లోని కనౌజ్‌, ఉన్నావ్‌, కాన్పుర్‌, హమిర్‌పుర్‌, అలహాబాద్‌, వారణాసి, బలియా, ఘాజిపుర్‌, పట్నా, ఛాప్రా తదితర ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి ఆర్‌టీ పీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించగా.. ఆ నమూనాల్లో కరోనా వైరస్‌ కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇవీ చదవండి:గంగానది తీరంలో సమాధుల కలకలం

ఇదీ చదవండి:గంగానదిలో తేలిన 50మృతదేహాలు..

శాస్త్రవేత్తలు, జన్యు నిపుణులు రెండు నెలలపాటు గంగానదిలో వైరస్‌ ఆనవాళ్లపై పరిశోధనలు చేశారు. గంగానది నుంచి సేకరించిన నమూనాల్లో వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ కనిపించలేదని బీఎస్‌ఐపీ శాస్త్రవేత్త నీరజ్‌ రాయ్‌ వెల్లడించారు. మే నెలలో గంగానదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన నేపథ్యంలో నిపుణులు ఆ నదిలో వైరస్‌ వ్యాప్తి జరిగి ఉండొచ్చని భావించారు. అందుకే బీహెచ్‌యూ, బీఎస్‌ఐపీ కలిసి పరిశోధనలు చేశాయి. వారణాసిలోని గంగానదిలో ఏడు వారాలపాటు ప్రతి వారం రెండు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. కానీ, గంగానదిలో వైరస్‌ ఆనవాళ్లు లేవని నిపుణులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details