తెలంగాణ

telangana

ETV Bharat / state

Covid Vaccine: టీకాలతోనే మేలు.. వైరస్‌లో వచ్చే మార్పులను తగ్గించవచ్చు

ప్రపంచవ్యాప్తంగా డెల్టా రకం వ్యాప్తిలో ఉన్నా.. కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టాప్లస్‌ వైరస్‌లో ఏవై3, ఏవై3.1 రకాల కేసులు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టీకాల పంపిణీతో వైరస్ మ్యుటేషన్ రేటు తగ్గిందని వెల్లడించారు.

Covid Vaccine
టీకాలతోనే మేలు

By

Published : Aug 13, 2021, 1:47 PM IST

దేశవ్యాప్తంగా టీకాల పంపిణీతో వైరస్‌ మ్యుటేషన్‌ రేటు తగ్గిందని.. ఎక్కువ మంది వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా వైరస్‌లో వచ్చే మార్పులను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ కంటే టీకాల పంపిణీని వేగవంతం చేయటం మేలన్నారు. డెల్టాప్లస్‌ వైరస్‌లో ఏవై3, ఏవై3.1 రకాల కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు కేసులు తగ్గినా పరీక్షల సంఖ్య తగ్గించరాదని హెచ్చరించారు. కొవిడ్‌-19 నుంచి నేర్చుకున్న, నేర్చుకోని పాఠాలపై శాస్త్రవేత్తలు, వేర్వేరు సంస్థల నిపుణులతో సీసీఎంబీ-అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌(ఏఐసీ) గురువారం నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో వారు విలువైన సూచనలు చేశారు.

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమ్‌ సైన్సెస్‌

దేశవ్యాప్తంగా ప్రస్తుతం డెల్టా వైరస్‌ వ్యాప్తిలో ఉంది. కొత్త మ్యుటేషన్లతో డెల్టాప్లస్‌లో ఏవై 1, 2, 3 అనే మూడు రకాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇందులో ఏవై 3, ఏవై 3.1పై దృష్టిపెట్టాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏవై3 పాజిటివ్‌ కేసులు 17వేల వరకు నమోదయ్యాయి. భారత్‌లో 261 కేసులున్నాయి. ఈ సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కొవిడ్‌ వైరస్‌ నమూనాలను సేకరించి, వైరస్‌ జన్యుక్రమాలను ఆవిష్కరించి అంతర్జాతీయ డేటాకు సమర్పించేందుకు సగటున 100 రోజులు పడుతోంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టీకాల పంపిణీ మొదలయ్యాక కేసులు తగ్గినా టెస్టింగ్‌ తగ్గించకూడదు. అప్పుడే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది.

- డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా, డైరెక్టర్‌

వారికి పొంచి ఉన్న ముప్పు

మొదటి వేవ్‌ అనంతరం కేసులు తగ్గడంతో హెర్డ్‌ ఇమ్యూనిటీపై నమ్మకంతో ఎన్నికలు, వేడుకలను నిర్వహించడంతో వైరస్‌ వ్యాప్తికి అవకాశం కల్పించినట్లయింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ కంటే టీకాల పంపిణీ వేగవంతం చేయడమే పరిష్కారం. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నవారు, వైరస్‌ బారిన పడిన వారితో పోలిస్తే మూడో వేవ్‌లో మిగతా వారికి ముప్పు ఎక్కువగా ఉంది. వీరు సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలి.

- డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, అధ్యక్షుడు పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా

మురుగునీటి పరీక్షలతో వైరస్‌పై దృష్టి

కొవిడ్‌ను పారదోలేందుకు మురుగునీటి నమూనాలను పరీక్షించే విధానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ విషయంలో విఫలం కావడంతో రెండో వేవ్‌లో వ్యాప్తి తీవ్రతను గ్రహించలేక పోయాం. రియల్‌ టైమ్‌లో డేటా అందుబాటులోకి తేవాలి. ప్రస్తుతం సర్వేలెన్స్‌ చాలా ఆలస్యంగా జరుగుతోంది. పకడ్బందీ నిఘా ఉండాలి. మరణాలకు కారణాలను తప్పక నమోదు చేయాలి. కచ్చితమైన డేటా ప్రజారోగ్య వ్యవస్థకు చాలా కీలకం.

- డాక్టర్‌ టి.జాకబ్‌జాన్, సీఎంసీ, వెల్లూరు

వైరస్‌ వ్యాప్తిపై నిఘా సాధ్యమే

దేశవ్యాప్తంగా జులై నాటికి 55వేల నమూనాల వైరస్‌ జన్యుక్రమాలను ఆవిష్కరించగా.. ఏడాది కాలంలో సీసీఎంబీలోనే 6,500 వరకు చేశాం. ఇప్పటి వరకు కొవిడ్‌పై పనిచేసే అవకాశం ఉందని 58 ఔషధాలను ల్యాబ్‌లో పరీక్షించాం. వైరస్‌ వ్యాప్తిపై నిఘా కీలకం కావడంతో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో మురుగునీటి నమూనాలను పరీక్షించాం. వారం, రెండువారాలకు ఒకసారి దేశవ్యాప్తంగా 400 నగరాల్లో 14,069 మురుగునీటి శుద్ధికేంద్రాల వద్ద నీటి నమూనాలను సేకరించి ఆర్‌టీపీసీఆర్‌పై పరీక్షించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిపై నిఘా సాధ్యమవుతుంది.

- డాక్టర్‌ వినయ్‌ నందికూరి, డైరెక్టర్, సీసీఎంబీ

ఇదీ చూడండి:కరోనా మృత్యు పంజా- ఒక్కరోజే 10వేల మంది బలి

ABOUT THE AUTHOR

...view details