Schools Reopen In Telangana: రాష్ట్రంలో ఇబ్బందుల మధ్యే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు జోరుగా ఉన్నప్పటికీ అరకొర వసతులతోనే విద్యార్థులకు స్వాగతం పలుకనున్నాయి. ఎనిమిదో తరగతి వరకు ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలుకానుండగా... అందుకనుగుణంగా ఏర్పాట్లు మాత్రం పూర్తికాలేదు. వీటికి తోడు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది.
Schools Open Today in Telangana: వేసవి సెలవులు ముగిశాయి.. రాష్ట్రంలో నేటి నుంచి బడి గంట మోగనుంది. యథావిధిగా సమస్యలతోనే కొత్త విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26వేల 73ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 23లక్షలమంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నెల 3 నుంచి నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మరో 70వేల మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభం కానుంది. ఇందు కోసం ఇప్పటి వరకు లక్షా 4వేల మంది ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ సైతం పూర్తయింది.
పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు పుస్తకాలు అందలేదు. 40 శాతం మేర పుస్తకాలు మాత్రమే పాఠశాలలకు చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బడులు సహా కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 2జతల దుస్తులు అందిస్తుంది. సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు కోటిన్నర మీటర్ల 'యూనిఫాం క్లాత్' అవసరం కానుంది. విద్యాశాఖ ఆలస్యంగా ఆర్డర్ ఇవ్వడంతో దుస్తులు ఆలస్యంగా అందనున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. చాలాచోట్ల విద్యా వాలంటీర్లను కూడా నియమించలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అంటున్నారు. పాఠశాలలు ప్రారంభం కానుండటంతో బస్సుల ఫిట్ నెస్‌పై రవాణా శాఖ దృష్టిసారించింది.