schools reopening in telangana today :పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి బడులు పునఃప్రారంభం అయ్యాయి. ఎండల తీవ్రత ఉన్నందున సెలవులు పొడిగించాలన్న వినతులను విద్యాశాఖ అంగీకరించలేదు. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్, కేజీబీవీ పాఠశాలలన్నీ నేడు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల బడుల్లో దాదాపు 58 లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టారు. సర్కారు బడుల్లో కొత్త తరగతిని ప్రారంభించేందుకు వస్తున్న విద్యార్థుల కోసం ఈ ఏడాది పలు నూతన కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది.
గతేడాది పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఆలస్యం కావడంతో.. ఈ ఏడాది జాగ్రత్తగా వ్యవహరించింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఇప్పటికే బడులకు చేరాయి. అయితే కొన్నిచోట్ల ఏకరూప దుస్తుల రంగు మారడంతో.. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు చేరేందుకు కొంత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఒకటి నుంచి 5వ తరగతి వరకు వర్క్ బుక్స్, 6 నుంచి పదో తరగతి వరకు నోట్ బుక్స్‌ను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయనుంది.
telangana schools reopen today :సర్కారు బడుల్లో విద్యార్థుల్లో రక్తహీనత సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఈనెల 20 నుంచి రోజూ ఉదయం రాగిజావ ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం మెనూలోనూ మార్పులు చేశారు. వారంలో ఒక రోజు కిచిడీ, మరో రోజు వెజిటబుల్ బిర్యానీ ఇవ్వనున్నారు. సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఏటా ఒక తరగతికి విస్తరిస్తున్నారు. ఈ ఏడాది తొమ్మిదో తరగతికి ఆంగ్లమాధ్యమం ప్రారంభం కానుంది. పదివేల బడుల్లో రీడింగ్ కార్నర్లను ప్రారంభించనున్నారు.
schools reopening in telangana today :మరోవైపు పలు సమస్యలు కూడా విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కొలిక్కి రాకపోవడంతో.. టీచర్ల నియామక ప్రక్రియ కూడా జరగలేదు. అనేక బడుల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. విద్యావాలంటీర్లు, పార్ట్ టైం ఇన్‌స్ట్రక్లర్లను కూడా నియమించలేదు.
మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి పథకం ద్వారా సుమారు సుమారు వెయ్యి పాఠశాలలను ఆధునికీకరించి రంగులతో అలంకరించి సిద్ధం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న నిర్వహించనున్న చదువుల పండగ రోజున వాటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల 800 ఉన్నత పాఠశాలల గదులను స్మార్ట్ తరగతి గదులుగా మార్చారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో మూత్రశాలలు, బెంచీల వంటి కనీస వసతులు లేని పాఠశాలలు కూడా విద్యార్థులను వెక్కిరిస్తూనే ఉన్నాయి..
schools reopening in telangana today 2023 :హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఫీజులను నియంత్రిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినప్పటికీ... ఈ విద్యా సంవత్సరం కూడా అమల్లోకి రాలేదు. ఫలితంగా పలు ప్రైవేట్ పాఠశాలలు 10 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. కరోనా సమయంలో కొంత తగ్గించిన ప్రైవేట్ విద్యాసంస్థలు.. వాటిని తిరిగి రాబట్టుకునేలా ఈ ఏడాది ఫీజులు పెంచాయి.
పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే బస్సులు, వ్యాన్లు, ఆటోలపై కొంత ఆందోళన ఎప్పటిలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లో పాత వాహనాల్లో పరిమితికి మించిన సంఖ్యలో విద్యార్థులను తీసుకెళ్తున్నారు. ఈ ఏడాది 229 రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. దసరాకు 13 రోజులు, సంక్రాంతికి ఆరు రోజులు, మిషనరీ స్కూళ్లకు 5 రోజులు క్రిస్మస్ సెలవులు ఉంటాయి.