ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఆన్‌లైన్ తరగతులు ఉండవని, కేవలం ప్రత్యక్ష బోధనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించింది. కానీ అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇప్పటివరకు ఉత్తర్వులు ఇవ్వకపోవడం గమనార్హం. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీఓలో, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఆ విషయాన్ని స్పష్టం చేయలేదు. అధికారులు మాత్రం ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం అంటే ఆన్‌లైన్ ఉండదనే కదా అర్థం అని చెబుతున్నారు. ఇప్పటికే ఇంటర్ విద్యాశాఖ టీశాట్ అధికారులకు తమ టీవీ పాఠాలను ఆపాలని కోరింది. ఇంకా పాఠశాల విద్యాశాఖ అధికారికంగా సమాచారం పంపలేదని టీశాట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ కూడా కొనసాగిస్తే ఏం చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరిని ప్రశ్నించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించాం.. వాటిని ఉల్లంఘిస్తే అప్పుడు తగిన చర్యలుంటాయని చెబుతున్నారు.
బలవంతం లేదు అంటూనే..
ఎక్కువమంది విద్యార్థులుంటే ఆ పాఠశాల యాజమాన్యం షిఫ్టు విధానంలో బడులను నడుపుకునేందుకు విద్యాశాఖ అనుమతిచ్చే అవకాశం ఉంది. ఒకవైపు హాజరు తప్పనిసరి కాదు.. బడికి పంపాలని బలవంతం చేయవద్దని ప్రభుత్వం చెబుతోంది.. మరోవైపు ఆన్‌లైన్ బోధనకు అనుమతి లేదంటే పిల్లలు చదువు మానేయాలని అర్థమా అని పాఠశాలల యజమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు.