తెలంగాణ

telangana

ETV Bharat / state

Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్... కొవిడ్ రూల్స్ మస్ట్! - తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు

కొవిడ్​ లాక్​డౌన్ నిబంధనల కారణంగా చాలాకాలంగా విద్యా సంస్థలకు దూరంగా ఉన్న పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడం ప్రారంభించారు. పాఠశాలలను శుభ్రం చేయించిన అధికారులు... కొవిడ్​ నింబధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

Schools Reopen
ప్రత్యక్ష తరగతులు ప్రారంభం

By

Published : Sep 1, 2021, 9:43 AM IST

Updated : Sep 1, 2021, 10:27 AM IST

కరోనా నేపథ్యంలో మూసుకున్న పాఠశాలలు, కళాశాలలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు పాఠశాలలను శుభ్రం చేసి... భౌతిక తరగతులకు సిద్ధం చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల స్వల్ప సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. మాస్కులు ధరించి తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో అధికారులు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించి పాఠశాలలోనికి అనుమతిస్తున్నారు.

జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని ఇంటర్​ బోర్డు స్పష్టం చేసింది. గురుకులాలు మినహా మిగతా పాఠశాలల్లో నేటి నుంచి ప్రత్యక్ష బోధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాల యాజమాన్యం బలవంతపెట్టొద్దని సూచించింది. ఆన్‌లైన్‌ లేదా ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది. విద్యార్థులు అనుసరించాల్సిన విధివిధానాలు రూపొందించాలని పాఠశాలలకు సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది.

నామమాత్రంగా హాజరు..

కొవిడ్​ నిబంధనల నడుమ అబిడ్స్​లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలు తెరిచారు. కొన్ని ప్రైవేటు స్కూల్స్ పదోతరగతి విద్యార్థులను మాత్రమే అనుమతించాయి. మరికొన్ని స్కూల్స్ ట్రాన్స్​పోర్ట్​ను అనుమతించలేదు. మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్రంగా విద్యార్థులు హాజరయ్యారు. మదినాగూడలోని ప్రభుత్వం పాఠశాలను తిరిగి ప్రారంభించారు. విద్యార్థులు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కార్వాన్​లోని ప్రభుత్వ పాఠశాలలో 1800 మంది విద్యార్థులు చదువుతుండగా నేడు సుమారు 700 మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చినట్లు ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ కుమార్ తెలిపారు.

హిమాయత్ నగర్​లోని ప్రైవేటు కళాశాలలు తెరుచుకున్నాయి. మెహదీపట్నం పుల్లారెడ్డి పాఠశాలలో వచ్చే వారం నుంచి 9,10 విద్యార్థులకు స్కూలు ప్రారంభించనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. అనంతరం 6,7,8 తరగతులకు ప్రత్యక్ష బోధన ఉంటుందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్కూల్స్​ పునఃప్రారంభమయ్యాయి. కానీ తొలిరోజు కావడంతో విద్యార్థులు స్వల్పంగా హాజరైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు కూడా పునః ప్రారంభమయ్యాయి.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని సురారం కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొవిడ్ నిబందలను పాటిస్తూ విద్యార్థులు వచ్చారు. క్లాస్​రూమ్​లో నియమాలను పాటించాలని సైన్ బోర్డులు, శానిటైజర్​లను ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో పాఠశాలలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది.

తోరణాలతో ముస్తాబు చేశారు..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు మండలంలోని బాలికల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేట్ ముందు.. ఆవరణలో శామియానా వేసి అందంగా అలంకరించారు. కొబ్బరి, అరటి ఆకులతో తోరణాలు కట్టి స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. చాలా కాలం తర్వాత పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉండాలని ఈ ఏర్పాట్లు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

ఇదీ చూడండి:TS High Court: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Last Updated : Sep 1, 2021, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details