Schools in Telangana : రెండు విద్యా సంవత్సరాల తర్వాత మళ్లీ జూన్లో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న విద్యాలయాల తలుపులు తెరుచుకోబోతున్నాయి. కరోనాతో గత రెండు విద్యా సంవత్సరాలు ఆగమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2020-21లో 2 (ఫిబ్రవరి, మార్చి) నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి తరగతులు ప్రారంభమైనా 50 శాతం మంది విద్యార్థులే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2 నుంచి 8 తరగతులకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం పాఠ్యపుస్తకాలను రెండు భాషల్లో ప్రచురిస్తున్నారు. అయితే ముద్రణ ఇంకా పూర్తికాలేదు.
19 వేల పోస్టుల ఖాళీ..
విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 19 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలున్నాయి. 2019-20లో 12,600 మంది విద్యా వాలంటీర్లు సేవలందించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు సరిగా నడవక.. 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో వాలంటీర్లను నియమించలేదు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తున్నారు. తర్వాత టీచర్ల నియామక పరీక్ష(టీఆర్టీ) జరిపినా భర్తీకి ఏడాది సమయం పడుతుందని అంచనా. అంటే ఈ విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు రావడం అనుమానమే. అయినా ఈ ఏడాది విద్యా వాలంటీర్లను నియమించడంలేదు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నా ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలతో నాణ్యమైన విద్య ఎలా అందిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.