తెలంగాణ

telangana

ETV Bharat / state

నీళ్ల ట్యాంకే.. అక్షర దేవాలయం... - pss trust

హైదరాబాద్ మియాపూర్ సమీపంలో ఓ వాటర్​ట్యాంక్​ను చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. పుస్తకాలు చేతపట్టిన చిన్నారులు...​ ట్యాంక్ పైకి ఎక్కుతూ కనిపిస్తారు. అక్కడేం పని అనుకుంటున్నారా..! ఖాళీగా ఉన్న నీళ్లట్యాంక్​ను తరగతి గదులుగా మార్చి పాఠ్యాంశాలు బోధిస్తోంది పీఎస్ఎస్ ట్రస్ట్. అంతేకాదు చిన్నారులకు ఆహారం, దుస్తులు, పుస్తకాలు అన్నీ సంస్థే అందిస్తోంది.

నీళ్ల ట్యాంకే.. అక్షర దేవాలయం...

By

Published : Aug 14, 2019, 6:46 AM IST

నీళ్ల ట్యాంకే.. అక్షర దేవాలయం...

మనిషిని విజ్ఞానవంతుడిగా చేసేది విద్య... ఎందరో బిడ్డలు ఆ చదువుకు దూరంగా ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అర్ధాంతరంగా పుస్తకాలను విడిచిపెట్టాల్సిన దుస్థితి. అలాంటి పేద విద్యార్థులను చేరదీసి విద్యను అభ్యసించేలా చేయందిస్తోంది పీఎస్​ఎస్​ సంస్థ. చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే ఏసీ గదైనా... తాటాకుల పాకైనా ఒక్కటే అని చాటుతున్నారు. నీళ్ల ట్యాంక్​నే తరగతి గదులుగా మార్చి పేదింటి చిన్నారులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతోంది పోతుకూచి సోమసుందర సామాజిక సేవా సంస్థ.

చదువు చెప్పే నీళ్లట్యాంకు

ఖాళీగా ఉన్న వాటర్​ ట్యాంక్​ను గదులుగా మార్చి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. తాటాకు దడులు కట్టి పాఠాలు వల్లిస్తున్నారు. విద్యతో పాటు జీవిత పాఠాలూ నేర్పిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులు, శాస్త్రవేత్తలు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి పాఠాలు బోధిస్తున్నారు.

మెరుగైన విద్యను అందించేందుకు:

పేద చిన్నారులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఈ ట్రస్టు ప్రధాన లక్ష్యం. అలాంటి వారిని ఎంపిక చేసి ఉదయం, సాయంత్రం పాఠాలు బోధిస్తారు. తొమ్మిదవ తరగతిలో ఉన్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్యను అందిస్తారు. పదోతరగతి తర్వాత ఉన్నత చదువులు చదివించేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ప్రస్తుతం రూరల్ ఇండియా, స్ట్రెంతెన్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్ సహా పలు జిల్లాల్లో సంస్థను ఏర్పాటు చేసి చదువు చెబుతున్నారు. ప్రతీ నిరుపేదకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

వారి లక్ష్యాలకు జీవం పోస్తూ..

ఒకప్పుడు వృథాగా ఉన్న నీళ్ల ట్యాంక్​ను అక్షర దేవాలయంగా మార్చి... వందల మంది జీవిత లక్ష్యాలకు జీవం పోస్తూ... ఎందరినో చదువులమ్మ ఒడికి చేర్చింది పీఎస్ఎస్ ట్రస్ట్. అందరికీ ఉన్నతమైన చదువులు అందాలనే.. సంస్థ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.

ఇదీ చూడండి:ఒక్కసారి తాగితే మళ్లీ అడుగుతారు

ABOUT THE AUTHOR

...view details