ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పని చేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ అలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధ్యాయుల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు - School education department orders teachers to declare details of assets annually
16:21 June 25
ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
జావీద్ అలీ పాఠశాల విధులకు హాజరు కాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్ బోర్డు సెటిల్మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్.. జావీద్ అలీపై ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని నిర్ధారించింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. జావీద్ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్ సిఫార్సు చేసింది. సిబ్బందికి బయో మెట్రిక్ హాజరు ఉండాలని సూచించింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక సిఫార్సు మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి..
భాగ్యనగరవాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌లు!