YCP publicity on 10th class study material: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు అద్దడం సరికాదని న్యాయస్థానం ఆక్షేపించినా.. అధికారులు, వారిని ప్రభావితం చేసే నాయకులు ఏమాత్రం తగ్గడంలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తమదైన ముద్ర వేస్తూ వినయ విధేయత చాటుకుంటున్నారు. ఇప్పటికే పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల, స్థల పట్టాలు, భూ హక్కు పత్రాలు -అన్నింటిపైనా అధికార పార్టీ రంగులు అద్దిన సంగతి తెలిసిందే.
అంతకుమించి.. అన్నట్లు:అంతకుమించి.. అన్నట్లు పరీక్షలు దగ్గర పడుతున్న వేళ.. పదోతరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలపైనా వైసీపీ రంగులద్ది.. ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాల ప్రచారంతోపాటు.. ముఖ్యమంత్రితో సహా ఇతర నాయకుల చిత్రాలు ముద్రించి పిల్లలకు పంచిపెడుతూ ఇంటింటి ప్రచారానికి తెరలేపింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న పదోతరగతి స్టడీ మెటీరియల్ (2022-23) తాజాగా వివాదాస్పదమైంది.
పూర్వ తూర్పుగోదావరిలో ఉండే.. ప్రస్తుత కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని 480 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూ.1.20 కోట్లు వెచ్చించి.. 49,000.. తెలుగు- ఆంగ్ల మాధ్యమ స్టడీ మెటీరియల్ పుస్తకాలు జడ్పీ నిధులతో ముద్రించారు. ఆయా పుస్తకాలను జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు ఇతర ముఖ్యుల చేతుల మీదుగా బుధవారం పంపిణీ ప్రారంభించారు.
'జగనన్న విద్యా 'భారతి' :'జగనన్న విద్యా 'భారతి' పేరుతో ముద్రించిన ఈ స్టడీ మెటీరియల్ పుస్తకం కవర్ పేజీపై వైసీపీ రంగుల మధ్య ముఖ్యమంత్రి జగన్ సహా.. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, జడ్పీ చైర్మన్, సీఈవోల చిత్రాలు ముద్రించారు. రెండో పేజీలో ముఖ్యమంత్రి విద్యార్థులతో ఉన్న విద్యా కానుక, నాడు-నేడు కార్యక్రమాల చిత్రాలు ముద్రించారు.