తెలంగాణ

telangana

ETV Bharat / state

బరువైన బాల్యం.. బడి బ్యాగు భయపెడుతోంది! - PILLALU

ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవాల్సిన పిల్లలు పుస్తకాల బరువులు మోయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిమితికి మించి బరువున్న బ్యాగులు మోయడం వల్ల వెన్నుముక దెబ్బతింటోంది. స్కూల్ బ్యాగు బరువుపై కమిటీలు, రిపోర్టులు ఎన్ని ఉన్నా... అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి.

బ్యాగు బరువులతో మగ్గిపోతున్న బాల్యం

By

Published : Aug 28, 2019, 7:59 AM IST

బ్యాగు బరువులతో మగ్గిపోతున్న బాల్యం

ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించిన విద్యార్థులు బడి సంచుల మోతతో వంగి పోతున్నారు. బ్యాగు బరువు మోయలేకపోతున్నామని తల్లిదండ్రులకు చెప్పినా... ఫరవాలేదు నాన్నా అంటూ తల్లిదండ్రులు చెప్పే మాటలతో ఆ భారం తప్పడం లేదు. పుస్తకాలు ఎంత ఎక్కువగా ఉంటే, అంత బాగా చదువు చెబుతారు అన్న ధోరణిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. తమ పాఠశాల పేరుతో ముద్రించిన బండెడు పుస్తకాలతో ప్రైవేటు యాజమాన్యాలు బాల్యంపై భారాన్ని పెంచుతున్నాయి. వీటీవల్ల పిల్లల కండరాలపై ఒత్తిడి పడి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. మరికొందరి పిల్లల్లో వెన్నుముక దెబ్బతిని లేవలేని స్థితికి చేరుకుంటున్నారు.

స్కూల్ బ్యాగు ఎంత బరువు ఉండాలంటే?

నర్సరీ, యల్​కేజీ, యూకేజీ విద్యార్థులు పుస్తకాలు మోయ కూడదు. ఇతర తరగతికి చెందిన విద్యార్థుల బ్యాగుల భారం శరీర బరువు కంటే పది శాతానికి మించకూడదు. చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్టు-2006 ప్రకారం విద్యార్థి శరీర బరువులో పుస్తకాల బరువు 10% మించకూడదు. అంటే 30 కిలోల బరువున్న విద్యార్థి 3 కిలోల బరువున్న బ్యాగు ఉండాలి. ఒకటో తరగతి విద్యార్థి శరీర బరువు 15 కిలోలు ఉంటే.. పుస్తకాల బురువు 1.5 కిలోలు ఉండాలన్న నిబంధన ఉంది. కానీ ప్రస్తుతం ఒకటో తరగతి విద్యార్థి కనీసం ఐదారు కిలోల బరువున్న బ్యాగును మోస్తున్నాడు. ఎనిమిదో తరగతి విద్యార్థి బరువు 30 కిలోల నుంచి 40 కిలోలు ఉంటే... పుస్తకాల బరువు సుమారు 12 కిలోలపైనే ఉంటుంది.

బ్యాగు బరువుకు కారణం

పాఠశాలలో రోజూ జరిగే సిలబస్ పుస్తకాలతోపాటు అసైన్మెంట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్, డైరీ నోట్, బుక్స్, గైడ్స్, మొదలైన పుస్తకాలతోపాటు హోంవర్క్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్, ఎన్విరాన్మెంట్ సైన్స్, వాటి క్లాస్ రూమ్​వర్క్ నోట్స్ మరియు హోంవర్క్ నోట్స్ ఉంటున్నాయి. ఇలా ఒక పుస్తకానికి 4 నోట్ పుస్తకాలిచ్చే సరికి బ్యాగు బరువు అమాంతంగా పెరిగి పోతోంది. వీటి వల్ల పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే తమ పాఠశాలలోనే పుస్తకాలు కొనాలి అనే నిబంధన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అమలు చేయడం వల్ల పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

శారీరక సమస్యలు...

శరీరానికి మించిన బరువు మోస్తుండడం వల్ల చిన్నారుల్లో శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. ఎముకలు, కండరాల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోంది. శారీరక ఎదుగుదల తగ్గిపోతోంది. చిన్నతనంలోనే వెన్నునొప్పి మొదలవుతోంది. శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువులు ఎక్కువగా మోయడం వల్లే విద్యార్థులకు సమస్యలొస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • స్కూల్ బ్యాగ్ బరువు, రోజు తీసుకురావాల్సిన పుస్తకాలపై, శాస్త్రీయ అంచనాతో తల్లిదండ్రులకు, పాఠశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలు ఇవ్వాలి.
  • కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే స్కూల్ బ్యాగులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • మిగిలిన పుస్తకాలు పాఠశాలలోనే దాచుకునే విధంగా ప్రతి విద్యార్థికి సదుపాయం కల్పించాలి.
  • పిల్లల బ్యాగు పొడవు పిల్లల వీపులో 75% కంటే ఎక్కువ భాగం మించకుండా చూసుకోవాలి.
  • రేక్కగూడు ఎముకల నుంచి మధ్య భాగం వరకు బ్యాగు ఉండేలా చూడాలి.
  • నడుము కిందికి బ్యాగు వేలాడేలా ఉండకూడదు. తేలికగా ఉండే బ్యాగులను ఎంచుకోవాలి.
  • భుజానికి తగిలించుకునే బ్యాగుల పట్టీల వెడల్పుగా ఉండాలి.
  • పిల్లలు బ్యాగును ధరించి నడుస్తున్నప్పుడు ముందుకు వంగినట్లు కనిపిస్తే... బ్యాగ్ బరువు ఎక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
  • బ్యాగులను పిల్లలు సరిగ్గా పైకి ఎత్తుకునేలా చూడాలి.
  • స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే పుస్తకాల విషయంలో అవసరం మేరకే ఇంటికి పంపించాలనే విషయాన్ని పాఠశాల సిబ్బందితో చర్చించాలి.

ఇతర రాష్ట్రాల్లో పిల్లల బ్యాగులపై నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఏకంగా విద్యాసంస్థలు ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. మరి మన రాష్ట్రంలో ఇంకెప్పుడు మోక్షం లభిస్తుందో..

ఇవీ చూడండి: ఊహల పల్లకీలో... దసరాలోపే మంత్రివర్గ విస్తరణ!

ABOUT THE AUTHOR

...view details