స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections telangana) కోసం ఓటర్ల జాబితా ఖరారుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాలకు ఎన్నికల కోసం ఈసీ ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితాను ఈ నెల 15వ తేదీన అందరికీ అందుబాటులో ఉంచుతారు. దానిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 20వ తేదీలోపు అభిప్రాయం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. 22వ తేదీ వరకు వాటిని పరిష్కరించి 23న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వారీగా ఈఆర్వోలను నియమించారు. ఆయాజిల్లాల అదనపు కలెక్టర్లు ఈఆర్వోలుగా వ్యవహరిస్తారు.
షెడ్యూల్ విడుదల
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections telangana) షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. స్థానిక సంస్థల కోటాలో 9 జిల్లాల్లో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు(MLC elections telangana) నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నెల 16న నోటిఫికేషన్, 23 వరకు నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ తేదీలను వెల్లడించింది. డిసెంబర్ 10న పోలింగ్.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ పేర్కొంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈసీ ఇటీవలె విడుదల చేసింది. ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. 17వ తేదీన పరిశీలన చేస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఎమ్మెల్యేల కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న ఉ.9 నుంచి సా.5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆశావహుల విశ్వప్రయత్నాలు
ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ ,మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి.. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ తెలిపింది. శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం గులాబీ పార్టీలో ఆశావహులు విశ్వయత్నాలు చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో.. అభ్యర్థిత్వం ఖరారు చేసేందుకు తెరాస నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ (VIDYA SAGAR), మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (KADIYAM SRIHARI), ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్ పదవీ కాలం జూన్ 3న ముగియడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ఆరుగురు మాజీలు మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరుగురిలో ఇద్దరు ముగ్గురికి రెన్యువల్ కావొచ్చునని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి , కడియం శ్రీహరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:MLC notification: ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్