ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పది మంది కీలక సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తి కాగా.. ఈనెల 26 నుంచి ఆగస్టు 13 వరకు 33 మంది సాక్షుల విచారణ చేపట్టేలా అనిశా ప్రత్యేక న్యాయస్థానం షెడ్యూలు రూపొందించింది.
కేసులో సుమారు 50 మందికి పైగా సాక్షులు ఉన్నందున.. విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని అనిశా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్రావు కోరారు. వారంలో రెండు రోజులు మాత్రమే విచారణ జరపాలని.. రోజూ విచారణ చేపట్టడం వల్ల న్యాయవాదులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది.. కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పాక్షికంగానే ప్రత్యక్ష విచారణలు చేపట్టాలని హైకోర్టు పేర్కొన్నందున వారానికి ఒక్కసారే సాక్షుల విచారణ చేపట్టాలని సెబాస్టియన్ తరఫు న్యాయవాది కోరారు. కరోనా నుంచి కోలుకుంటున్నానని, రోజూ సాక్షుల విచారణ వల్ల ఇబ్బంది పడుతున్నానని ఉదయ్ సింహా తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.