సింగరేణిలో కరోనా పరిస్థితులపై కొత్తగూడెంలోని డైరెక్టర్లు, వైద్య సిబ్బందితో సంస్థ సీఎండీ శ్రీధర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రుల్లో 643 కరోనా పడకలు ఉండగా.. మరో 600 బెడ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
'రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి' - కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎండీ శ్రీధర్
సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో తాత్కాలిక ప్రాతిపదికపై మరో 21 మంది విశ్రాంత వైద్యులను నియమించనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం ఇప్పటికే సుమారు 8 కోట్ల రూపాయల విలువైన మందులు, కిట్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 వేల 583 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2వేల 384 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వివరించారు. వారిలో 808 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన 226 మంది కంపెనీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరో 1208 మంది సింగరేణి క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారని.. మరో 83 మంది హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కరోనా పరీక్షలు మరింత పెంచాలని సీఎండీ స్పష్టం చేశారు. రానున్న కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కార్మికులకు సూచించారు.
ఇదీ చూడండి :'వైద్య సిబ్బంది పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది'