జీవితాంతం కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన 130వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి.. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ప్రసాదించిన మహానీయుడు అంబేడ్కర్ అని మంత్రి కొప్పుల అన్నారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లతో కొత్తగా "సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం" ను రూపొందించారని మంత్రి తెలిపారు. ఎస్సీలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా 268 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.